తమకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం సామాన్య ప్రజలు పోలీసు వారిని ఆశ్రయిస్తారని, సమస్యతో వచ్చిన ప్రజల యొక్క సమస్యలను సానుకూలంగా విని, చట్ట పరిధిలో విచారణ జరిపి, పూర్తిస్థాయి పరిష్కారం అందించేలా ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ అన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వారి యొక్క సమస్యలను స్పందన కార్యక్రమంలో అర్జీల రూపంలో సమర్పించడానికి రాగా, ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ శ్రీ వెంకట రామాంజనేయులు గారితో కలిసి వారి ఫిర్యాదులను స్వీకరించి, సమస్యపై విచారణ చేసి పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు వారి సమస్యలను ధైర్యంగా తెలుపుకునే అవకాశం కల్పించాలని పోలీస్ అధికారులకు తెలిపారు.