రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ, వరద సహాయక చర్యలను ఈ ప్రభుత్వం సమర్థవంతంగా చేపడుతుంది అని మంత్రి అంబటి రాంబాబు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గ్రామ సచివాలయాల్లోని వాలంటీర్ల మొదలు, జిల్లాల యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం, మంత్రుల వరకు వరద సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ప్రజలను సైతం భాగస్వాములను చేస్తూ వరద బాధితులను చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. వాస్తవాలు ఇలా ఉంటే.. చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియా ప్రభుత్వంపై బురదచల్లుతూ, వరదల సమయంలో కూడా రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రిగారు అక్కడకు వెళ్ళి, వారి ముందు నాలుగు ఫోటోలు దిగి, ఆర్భాటాలు చేయకపోవచ్చుగానీ, ప్రతిక్షణం సీఎంగారు వరద పరిస్థితులపై అధికారులతో, మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ.. ఆదేశాలు ఇస్తూ ఉన్నారు.
గడిచిన 36 ఏళ్లలో గోదావరికి ఇంత ఉద్ధృతంగా వరదలు వచ్చిన సందర్భాలు లేవు, 1986లో ఇంతకన్నా ఎక్కువగా వరదలు వచ్చాయని తెలిపారు. అయితే జూలై నెల మొదట్లో ఇంతస్థాయిలో వరదలు రావడం ఎప్పుడూ జరగలేదన్నారు. 27 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వస్తే మొదట మేమంతా భయపడ్డాం. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ను డిజైన్ చేసింది 28 లక్షల క్యూసెక్కులకు మాత్రమే. ఒకవేళ వరద పెరిగి, 28-29 లక్షల క్యూసెక్కులకు వెళితే.. కాఫర్ డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడుతుందని భావించి, సీఎం గారి ఆదేశాల మేరకు, యుద్ధప్రాతిపదికన 30 లక్షల క్యూసెక్కులు వచ్చినా, పోలవరం డ్యామ్ దెబ్బతినకుండా ఉండేందుకు, ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు 2 మీటర్లు పెంచి తక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.