ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్లో దారుణ ఘటన వెలుగు చూసింది. స్కూలుకు వెళ్లనని మారం చేసిన ఐదేండ్ల చిన్నారికి ఆమె తల్లి 17 చోట్ల వాతలు పెట్టింది. దాంతో భార్యపై భర్త ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళ్తే.. సంత్ కబీర్నగర్కు చెందిన కాంచన, కాలేశ్వర్లల దంపతులకు ఐదేండ్లు, 9నెలల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తాజాగా ఐదేండ్ల చిన్నారిని స్థానిక పాఠశాలలో చేర్పించారు. అయితే చిన్నారిని తల్లి పాఠశాలకు వెళ్లమని చెప్పగా ఆమె స్కూలుకు వెళ్లనని మారం చేసింది. దాంతో ఆగ్రహించిన తల్లి.. కత్తిని స్టవ్పై పెట్టి వేడి చేసి చిన్నారి శరీరంపై 17 చోట్ల వాతలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం బాలికను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తన భార్యపై కేసు పెట్టాడు.