శ్రీలంకలో అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్‌లో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆ దేశ చరిత్రలో దేశాధ్యక్షుడి కోసం పార్లమెంట్‌లో ఎన్నిక జరగడం చరిత్రలో ఇది మొదటిసారి. ఇంతవరకు ప్రజలే ప్రత్యక్షంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. శ్రీలంక అధ్యక్ష పదవికి త్రిముఖ పోరు నెలకొంది. గొటబాయ రాజపక్స శ్రీలంక నుంచి పారిపోయి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఉన్నారు. ఆయన ఈ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. అలాగే, దుల్లాస్ అలహప్పెరుమ, అనుర డిసానాయకె కూడా ఈ పోటీలో నిలిచారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నిక జరుగుతోంది. విక్రమసింఘేకు రాజపక్సల పార్టీ ఎస్ఎల్పీపీ మద్దతు తెలిపింది. శ్రీలంకలో మొత్తం 225 మంది సభ్యులు ఉంటారు. ఎస్ఎల్పీపీ సభ్యులు పార్లమెంటే అధికంగా ఉన్నారు. విక్రమసింఘే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ ఎన్నికలో గెలిచిన నేత అధ్యక్షుడిగా 2024 నవంబరు వరకు పదవిలో కొనసాగుతారు. శ్రీలంకలో విక్రమసింఘే ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ విక్రమసింఘే అధ్యక్షుడిగా విజయం సాధిస్తే, ఆ దేశ విపక్ష నేత సజిత్ ప్రేమదాస ప్రధాని అయ్యే అవకాశం ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను వారి పాలన, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయోననన్న ఆసక్తి నెలకొంది. సంక్షోభం నుంచి శ్రీలంక ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనపడట్లేదు.