అనుమానం పెనుభూతంగా మారితే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణమే జరిగింది. మూఢనమ్మకాలు మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో ఆత్మీయులే దారుణంగా కొట్టి చంపడం కలకలంరేపింది. గిద్దలూరు మండలం కొత్తపల్లికి చెందిన ఈనెల 12న క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో కుక్క మల్లికార్జున అనే యువకుడు సొంత బాబాయి కుటుంబంపై కిరాతకంగా రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పిన్ని ఈశ్వరమ్మ అక్కడికక్కడే చనిపోగా.. బాబాయి తిరుమలయ్య, చెల్లెలు స్వప్న తీవ్రంగా గాయపడ్డారు.
వీరిద్దర్ని నంద్యాలలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ తిరుమలయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. అక్కడ రెండు రోజులపాటు చికిత్స పొందిన తిరుమలయ్య కూడా కన్నుమూశాడు. వీరి కుమార్తె స్వప్న పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. అక్కడ తొమ్మిది రోజులపాటు వైద్యులు చికిత్స అందించారు.. ఆమె కూడా బుధవారం కన్నుమూశారు. స్వప్నఆరు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ దాడిలో స్వప్న గర్భంలోని పిండం చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన తర్వాత నిందితుడు కుక్క మల్లికార్జున పరారయ్యాడు. అప్పటినుంచి పోలీసులు నిందితుడి కోసం పలు బృందాలుగా విడిపోయి గాలిస్తూనే ఉన్నారు. ఓ స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి క్షుద్ర పూజల అనుమానంతో సొంత బాబాయి కుటుంబంపై దాడి చేసి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన ఎదుగుదలకు అడ్డుగా వస్తున్నారనే దారుణంగా హత్య చేశారని చెబుతున్నారు.