రాష్ట్రపతిగా పదవి విరమణ చేయనున్న గౌరవనీయులు శ్రీ రాంనాథ్ కోవింద్ గారి వీడ్కోలు సందర్భంగా ఈ నెల 22 ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర హోమ్ మరియు సహకార శాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ చారిత్రాత్మక సభకు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ సమావేశానికి వెళ్లలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. నిష్కళంకుడైన శ్రీ రాంనాథ్ కోవింద్ గారు తన అయిదేళ్ల పదవీకాలంలో ఎటువంటి పొరపొచ్చాలకు తావు లేకుండా రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడం ఆయనలోని రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఆయన తన సేవలను అజరామరంగా నిర్వర్తించాలని, ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేసారు.