ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తనదైన శైలీలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున్నే ఇంటింటికి తిరిగి పేపర్ వేస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజంగానే. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పేపర్‌బాయ్ అవతారమెత్తారు. వేకువజామునే పట్టణంలోని మావుళ్లమ్మపేటకు వెళ్లారు. అక్కడ ఆయన స్థానిక పేపర్‌బాయ్స్‌తో కలిసి వాటిని కట్టగా కట్టారు. అనంతరం సైకిల్‌పై 31వ వార్డులోని నాగరాజుపేట, మరికొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి తిరగి పేపర్ వేశారు.
పాలకొల్లు నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లలో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి వాటిని ఇవ్వడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని లబ్ధిదారులకు వివరించడానికి ఇలా నిరసన తెలియజేశారు. పేపర్లు తీసుకోవడానికి వచ్చిన వారికి ప్రభుత్వం తీరును, పాలకొల్లుకు పది కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు కేటాయించిన విధానాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ప్రతి నెలా నాలుగు రోజులు ఇలా అందరిని కలిసి పేపర్ అందిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలియజేస్తానని చెబుతున్నారు. మరో నాలుగు రోజులు పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసనకు దిగుతానని ఎమ్మెల్యే రామానాయుడు అంటున్నారు. మొత్తానికి రామానాయుడుపేపర్ వేయడం స్థానికంగా కూడా చర్చనీయాంశమైంది.