నాటు సారా పట్టుకొనేందుకు వస్తున్న ఎస్సైపై కొందరు దాడికి పాల్పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్సై దాడి కలకలంరేపింది. భామిని మండలం పాలిష్ కోట పంచాయితీ పరిధిలోని కొత్తగూడ సమీపంలో నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయి. పక్కా సమాచారంతో తోటి సిబ్బందితో బత్తిలి ఎస్సై సీతారామ్ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా నాటుసారా తయారీ దారులు, స్థానికులు ఒక్కసారిగా పోలీసులపై కర్రలతో దాడి చేశారు. గాయాలు పాలైన ఎస్సై సీతారామ్, కానిస్టేబుల్ నవీన్‌ను తొలుత కొత్తూరు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలానికి కొంత మంది పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మన్యం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అడిషనల్ ఎస్పీ దిలీప్ కుమార్, పాలకొండ డీఎస్పీ శ్రావణి పాలకొండ ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. ఎస్సై సీతారామ్‌కు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ దాడికి ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా వదిలేదని.. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ, డీఎస్పీని ఆదేశించారు. నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.