గడపగడపకు కార్యక్రమంలో మంత్రులకు ప్రజల నుంచి తీవ్ర పరాభావాలు ఎదురవుతున్నాయి. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో ఓ మహిళ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని 30వ వార్డులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మాధవి అనే మహిళ దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందిన పథకాలు, లెక్కలు చెప్పే ప్రయత్నం చేశారు.
మహిళ నుంచి మంత్రికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె తన కుటుంబానికి అందిన పథకాలపై వరుస పెట్టి ప్రశ్నలు అడగడంతో మంత్రితో పాటు.. అక్కడి అధికారులు ఒకింత అవాక్కయ్యారు. తమకు టైలర్ల సాయం కింద డబ్బు వస్తుందంటే దరఖాస్తు చేయగా మంజూరు చేశారని.. కానీ డబ్బు పడకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు. తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు వస్తాయని నమ్మి మూడు ఓట్లు వేశామన్నారు. వెంటనే స్పందించిన మంత్రి బుగ్గన ‘మీ కుటుంబానికి రూ.98,140 పడ్డాయి కదమ్మా.. ఇంకా రాలేదని ఎలా చెబుతావమ్మా’ అన్నారు. అయితే రూ.లక్ష ఇచ్చి.. రూ.2 లక్షలు లాగుతున్నారని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. టైలర్ల సాయం కింద ఆమెకు డబ్బు పడిందని, బ్యాంకు ఖాతాలో చూసుకోలేదని సచివాలయం సిబ్బంది అన్నారు.
'మా డబ్బు తీసుకుని మాకిస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు. ఆమె అడిగిన ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు.. పథకాల సంగతి పక్కన పెడితే.. ఈ మూడేళ్లలో వంట నూనే నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలు పెరిగాయి అంటూ మంత్రిని ప్రశ్నించారు. గతంలో రూ.98 ఉన్న వంటనూనె ప్రస్తుతం రూ.200కు పెరిగిందని ఇలా అయితే ఏం తినాలి.. ఎలా బతకాలి అన్నారు.
మంత్రి బుగ్గన స్పందించి.. ఈ ధరలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెరిగింది అంటూ వివరించారు. కానీ ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు.. వరుసగా ప్రశ్నిస్తుండడంతో అసలు 'మీకు వినే ఉద్దేశం లేదమ్మా' అసహనం వ్యక్తం చేశారు. అప్పటికీ మహిళ వెనక్కు తగ్గలేదు. చెత్త పన్ను అంశాన్ని మంత్రి దగ్గర ప్రస్తావించారు. ఇలా పన్నులు బాదేస్తూ.. డబ్బులు ఇస్తున్నామంటే ఎలా అంటూ గట్టిగా మాట్లాడారు. దీంతో మంత్రి పట్టణ సుందరీకరణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియపరిచే ప్రయత్నం చేశారు. ఆమె మాత్రం వినకుండా ప్రశ్నిస్తూనే ఉన్నారు.. దీంతో మంత్రి, బుగ్గన ఇతర అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.