రాయిని చూసేందుకు తండోపతండాలుగా జనం వస్తున్నారు. అదేదో ప్రపచంలో ఎక్కడా చూడని పెద్దరాయి మాత్రం కాదు. ఐదు కేజీలకుపైగా ఉండే ఓ చిన్నరాయి మాత్రమే. అయినా జనం చూసేందుకు ఎందుకు వస్తున్నారో తెలుసా...? ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలోని ఇషాన్ నదిలో తేలాడుతున్న రాయి వీడియో, ఫొటోలు ఇటీవల వైరల్‌గా మారాయి. ఆ రాయిపై రామ్ అని రాసి ఉండటం.. బాగా బరువున్నా కూడా అది నీటిలోనే తేలాడుతూ ఉండటంతో అది రామసేతు రాయేనంటూ అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. రాయి బరువు 5.7 కిలోలు ఉన్నా తేలాడుతూ ఉండటంతో.. రామ రావణ యుద్ధంలో రామసేతు వంతెన కోసం ఉపయోగించి రాయేనంటూ ప్రచారం జరుగుతోంది.
థానా బేవార్ ప్రాంతంలోని మొయిన్‌పురి గ్రామ సమీపంలో ఇషాన్ నది ప్రవాహంలో జులై 30వ తేదీ ఈ రాయి కొట్టుకొచ్చింది. గ్రామానికి చెందిన కొందరు చిన్న పిల్లలు నదిలో చేపలు పట్టుకుంటున్న సమయంలో ఈ రాయి కనిపించిందని.. నల్లగా బరువుగా ఉన్న రాయి తేలాడుతూ వస్తుండటంతో దాన్ని బయటకు తీశారని.. దానిపై రామ్ అని రాసి ఉందని స్థానికులు చెబుతున్నారు.
దాంతో రామ్ అని రాసిన ఈ రాయిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా అహ్మల్‌పూర్ గ్రామానికి వస్తున్నారు. రామసేతు వంతెన నిర్మాణంలో ఉపయోగించినవి చాలా పెద్ద రాళ్లని.. వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువ పరిమాణంలో ఉంది. ఈ దైవ స్వరూప రాయిని ఆలయ సమీపంలో ప్రతిష్టించాలని ప్రజలు కోరుతున్నారు.