తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ రాష్ట్ర గవర్నర్ తన వ్యాఖ్యల విషయంలో వెనక్కితగ్గారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఆర్థికస్థితిని ఉద్దేశించి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర దూమారం రేగింది. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో గవర్నర్ దిగివచ్చారు. మహారాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని కోరుతూ ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే అసలు ఈ రాష్ట్రంలో డబ్బేం మిగలదంటూ గత శుక్రవారం ఓ కార్యక్రమంలో గవర్నర్ కోశ్యారీ నోరుజారిన విషయం తెలిసిందే. ‘గుజరాతీలు, రాజస్థానీలు మహరాష్ట్ర నుంచి మరీ ముఖ్యంగా ముంబయి, ఠాణెలను వదిలి వెళ్లిపోతే రాష్ట్రంలో డబ్బేం మిగలదు.. ముంబయి దేశ ఆర్థిక రాజధాని అర్హత కూడా కోల్పోతుంది’ అని వ్యాఖ్యానించారు.
గవర్నర్ వ్యాఖ్యలను ఖండించిన పలు రాజకీయ పార్టీలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అలాగే, శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సైతం ఘాటుగానే స్పందించారు. ‘హిందువుల మధ్య విభజన తీసుకువచ్చేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారు.. ఆయన వ్యాఖ్యలు మరాఠీ ప్రజలను అవమానించడమే.. ఆయన్ను ఇంటికి సాగనంపాలా అన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది.. కోశ్యారీ కూర్చొన్న స్థానాన్ని గౌరవించడం కోసం ఇంకెంత కాలం మౌనంగా ఉండాలో తెలియడం లేదు... ఈ వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అంటూ ఉద్ధవ్ డిమాండ్ చేశారు.
కష్టపడి పనిచేసే మహారాష్ట్ర ప్రజలను గవర్నర్ అవమానించారంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. అటు ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. అవి గవర్నర్ వ్యక్తిగత వ్యాఖ్యలు అని, వాటికి తాను మద్దతివ్వబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలు సైతం ఎదురుదాడి ప్రారంభించడంతో కోశ్యారీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
‘‘జులై 29న జరిగిన ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో ముంబయి అభివృద్ధికి కొన్ని సమాజాలు చేస్తున్న కృషిని ప్రశంసించడంలో నేను పొరపాటు చేసి ఉండవచ్చు.. మహారాష్ట్ర మాత్రమే కాదు, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరి ప్రత్యేక సహకారం ఉంది.. మహారాష్ట్ర ప్రజలు పెద్దమనసు చేసుకొని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘ అనేక మంది సాధువుల బోధనలకు కట్టుబడి ఈ రాష్ట్రానికి చెందిన వినయపూర్వకమైన సేవకుడిని మహారాష్ట్రవాసులు క్షమించాలని నేను ఆశిస్తున్నాను. ఇది నా వైపు నుంచి అనుకోకుండా జరిగిన పొరపాటు’’ అని క్షమాణపలు కోరారు. అంతకు ముందు కూడా‘‘కొందర్ని ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో తాను తప్పుగా మాట్లాడిఉండొచ్చు.. మరాఠా ప్రజలను కించపరిచే ఉద్దేశం తనకు లేదు.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అని గవర్నర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.