ఈడీని ప్రశ్నిస్తూ మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ లో వెలసీన ఓ బ్యానర్ అందర్నీ ఆకట్టుకొంటోంది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దూకుడు పెంచారు. రాష్ట్రమేదైనా సరే.. వివిధ కుంభకోణాల కేసుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎంతటి నాయకులునైనా సరే ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ ఆసక్తికరమైన బ్యానర్ వెలుగు చూసింది. ఈడీ, సీబీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్‌లను ప్రశ్నిస్తూనే ఉన్న ఆ బ్యానర్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ఆ బ్యానర్‌లో ఉన్న ప్రశ్నకు సమాధానం చెబితే.. లక్ష రూపాయలు ఇస్తామని కూడా పేర్కొన్నారు.
విపక్ష నేతలపై ఈడీ చర్యలు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం బ్యానర్లు ఏర్పాటు చేసింది. "బీజేపీ నాయకులపై ఈడీ, సీబీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకుంటాయా..?. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి మారిన తర్వాత నాయకులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు దర్యాప్తు కొనసాగించిందా..? అని ప్రశ్నిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు "ఒక వేళ చర్యలు కొనసాగుతున్నాయని తెలిస్తే వివరాలు చెప్పండి.. అక్షరాల ఒక లక్ష రూపాయలను గెలుపొందండి." అని రాసిన బ్యానర్లను ఔరంగాబాదు ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ పెట్టించారు.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఫోటోను ప్రింట్ చేయించిన ఆ బ్యానర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్యానర్లను క్రాంతి చౌక్ పరిసరాల్లో కట్టించారు. అయితే ఇతర పార్టీల నేతలను ఎలాగోలా తమ పార్టీలోకి చేర్చుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రయత్నిందని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ బ్యానర్లను ఏర్పాటు చేయించినట్టు తెలుస్తుంది.
ఇదిలావుంటే భూ కుంభకోణంలో భాగంగా ఈడీ అధికారులు శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో కొన్ని గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. అరంతరం అదే రోజున అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సంజయ్ రౌత్ తన ప్రాణం పోయినా.. శివసేన పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు. తన ప్రత్యర్థులను భయపెట్టేందుకు, విమర్శకుల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా విమర్శించింది.