హిజాబ్ వివాదానికి కేంద్ర బిందువు అయిన కర్ణాటక రాష్ట్రంలో ఇపుడు గుడ్డు వివాదం మొదలైంది. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై బీజేపీ నాయకురాలు తేజస్విని అనంత్ కుమార్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం విద్యార్థులకు భోజనంలో గుడ్లు ఎందుకు ఇస్తున్నారని ఆమె మంగళవారం ప్రశ్నించారు. అందరికీ గుడ్లు పెడితే మరీ శాఖాహారుల సంగతేంటని.. ఆమె అడిగారు. చాలామంది మంది శాఖాహారులకు గుడ్లు ఆమోద యోగ్యం కాదని, అందరికీ సమానమైన విధానాలను రూపొందించాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
"మన కర్ణాటక ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వాలని ఎందుకు నిర్ణయించింది..? ఇవి పోషకాహారానికి మూలం మాత్రమే కాదు. శాకాహారులైన చాలా మంది విద్యార్థులకు ఇది మినహాయింపు." ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు ఉండేలా విధానాలు రూపొందించాలి." అని ట్విట్టర్‌లో తేజస్విని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకు అందరికీ "పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్" పథకంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు, అరటిపండ్లు లేదా వేరుశెనగ చిక్కీలను అందించనున్నట్టు కర్ణాటక పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం గత నెలలో ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో ఏడాదికి 46 రోజులు విద్యార్థులకు వీటిని అందిస్తారు. విద్యార్థులకు అన్ని పోషకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెనూను ఏర్పాటు చేసింది.
తేజస్విని అనంత్ కుమార్ విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పందించారు. ఏ విద్యార్థిని గుడ్లు తినమని ఒత్తిడి చేయబోమని అన్నారు. శాఖాహారులు చిక్కీలు, అరటిపండ్లు ఎంచుకోవచ్చని ఆయన చెప్పారు. అయితే 2021 డిసెంబర్‌లో మధ్యాహ్న భోజనంలో గుడ్లను చేర్చాలనే నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లింగాయత్ సంస్థలు చేసిన పిలుపుతో వివిధ సంఘాలు, సంస్థలకు చెందిన పలువురు నాయకులు కూడా విభేదించారు. ఈ విషయంలో ప్రభుత్వ వెనక్కి తగ్గితే పోరాటాలకు సిద్ధమని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి మధ్యాహ్న భోజనంలో మాంసం, గుడ్లను చేర్చాలని కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ ఛైర్మన్ సీఎస్ ద్వారకానాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లతో పాటు మాంసాహారాన్ని కూడా భాగం చేయాలని డిమాండ్ చేశారు. విటమిన్ బీ 12 లోపం వల్ల చాలా మంది పిల్లలకు రక్తహీనత ఉందని, ఎక్కువ మాంసం తినడం ద్వారా చికిత్స చేయవచ్చని ఆయన తెలిపారు. కాగా ఇలా గుడ్లు పెట్టడం వల్ల కర్ణాటకలోని ఏడు జిల్లాలో పిల్లల్లో పోషకాహార స్థితి మెరుగైనట్టు పరిశోధనల్లో తేలింది.