ఇండిగో విమానాలకు కాలం ఏ మాత్రం కలసిరావడంలేదు. తాజాగా ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో పార్క్ చేసిన ఇండిగో విమానం కిందకు గో ఫస్ట్ కారు వెళ్లి ఆగిపోయింది. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం వీటీ-ఐటీజే ఎయిర్‌క్రాఫ్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ టీ-2లో ఆగి ఉండగా గో ఫస్ట్ కారు కిందకు వెళ్లింది. అలా వెళ్లిన కారు అక్కడే ఆగిపోయింది. ఈ విమానం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సి ఉంది. అయితే కొంతసేపటికే ఆ సమస్య పరిష్కారం అవ్వడంతో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. ఢిల్లీ నుంచి పాట్నాకు అనుకున్న సమయానికి బయలుదేరింది.
అయితే ఈ ఘటనపై డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానాశ్రయ టీ2 టెర్మినల్‌లోని స్టాండ్ నెంబర్ 201 దగ్గర జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. కారు ఎందుకు ఆగిందనేదానిపై విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మద్యం సేవించాడేమోననే అనుమానంతో కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే ఇండిగో ఎయిర్‌లైన్స్‌లోని ప్రయాణికులు ఇబ్బందులు పడడం ఇదే మొదటిసారి కాదు. జూలై 28న కోల్‌కతాకు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో అసోంలోని జోర్హాట్ విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారిపోయింది. ఆరు గంటల పాటు ప్రయత్నించినా సాంకేతిక లోపాన్ని సరిచేయడంలో అధికారులు విఫలమయ్యారు. దాంతో విమానాన్ని రద్దు చేశారు. అదేవిధంగా జూలై 21న ఇండిగో విమానాన్ని పాట్నా విమానాశ్రయంలో నిలిపివేశారు. ఒక ప్రయాణికుడు తాను విమానంలో బాంబును తీసుకెళ్తున్నట్టు చెప్పడంతో ప్రయాణికులు దిగవలసి వచ్చింది.