మార్కెట్ లో కొత్తకొత్త వాహనాలు వచ్చేస్తున్నాయి. తాజాగా మహీంద్రా స్కార్పియో ఎస్ యూవీ మార్కెట్ లోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈ కారు అంటే కొందరు అమితంగా ఇష్టపడతారు. ప్రముఖుల కాన్వాయ్ లలో ఈ వాహనాలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా స్కార్పియో సిరీస్ లో తీసుకొచ్చిన స్కార్పియో ఎన్ వాహనానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. రిజర్వేషన్ లు ప్రారంభించిన గంట వ్యవధిలోనే లక్ష వాహనాలకు బుకింగ్ లు వచ్చాయంటే డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. దీని కొనుగోలుకు ముందు తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
ఈ వాహనం కొనేసుకుని వెంటనే రయ్ మంటూ డ్రైవ్ చేద్దామనుకునే నిరాశ చెందాల్సిందే!. ఎందుకంటే దీని కోసం దీర్ఘకాలం పాటు ఆగక తప్పదు. డిమాండ్ ఎక్కువగా ఉండడం, అదే సమయంలో ఆటో విడిభాగాలు, చిప్ ల సరఫరా వైపు సమస్యలతో కోరుకున్న ప్రతి ఒక్కరికీ స్కార్పియో ఎన్ అందించేందుకు చాలా సమయమే పట్టేట్టు ఉంది. ఎందుకంటే మహీంద్రాకు చెందిన ఎక్స్ యూవీ 700 కోసం ఏడాది వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. కనుక దీని కోసం కూడా ఏడాదికిపైనే వేచి చూడాల్సి రావచ్చు.
ఇదిలావుంటే డీజిల్ వెర్షన్ అయితే 12 కిలోమీటర్లు, పెట్రోల్ వెర్షన్ అయితే 11-12 కిలోమీటర్లు ఒక లీటర్ కు మైలేజీ వస్తుంది. ట్రాఫిక్ అవాంతరాల్లేని హైవేల మీద ఇచ్చే మైలేజీ వివరాలు ఇవి. పట్టణాల్లో అయితే ఇంకా తక్కువ మైలేజీ వస్తుంది.
ఈ వాహనం చూడ్డానికి పెద్దగానే ఉంటుంది. కానీ, లోపల స్పేస్ విషయంలో అంత స్వేచ్ఛ ఉండదు. ఆరు లేదా ఏడు సీట్లు ఎంపిక చేసుకుంటే, అందరూ కూర్చున్న తర్వాత లగేజీకి మిగులు స్పేస్ ఉండదు. రూఫ్ క్యారియర్ ఒక్కటే ఆప్షన్. ముఖ్యంగా స్కార్పియో ఎన్ వాహనంలో మూడో వరుసలో తిరగడానికి అంత సౌకర్యంగా ఉండదు. కంజెస్టెడ్ గానే ఉంటుంది.