ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ తో యుద్దం..పుతిన్ గర్ల్ ఫ్రెండ్ కు కష్టాలు తెచ్చిపెట్టింది

international |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 03:44 AM

ఉక్రెయిన్ తో రష్య యుద్దం ఆ దేశ అధినేత వ్లాదిమిర్ పుతిన్ గర్ల్ ఫ్రెండ్ కు కొత్త కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై అమెరికా సహా పశ్చమ దేశాల ఆంక్ష‌లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ గ‌ర్ల్ ఫ్రెండ్‌ అలీనా క‌బయేవా పై అమెరికా ఆంక్ష‌లు విధించింది. మాజీ ఒలింపియన్, జిమ్నాస్ట్ అయిన అలీనా క‌బయేవాతో వ్లాదిమిర్ పుతిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే అలీనాతో పాటు రష్యా వొల్గారిచ్‌లు , ఉక్రెయిన్‌లోని ఆక్రమించుకున్న ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహిస్తోన్న నలుగురు క్రెమ్లిన్ అధికారులపై కూడా అమెరికా ట్రెజ‌రీ శాఖ ఆంక్ష‌లు ప్ర‌క‌టించింది. పుతిన్ స్నేహితుడు, బిలియ‌న‌రీ ఆండ్రే గ్రిగోర‌విచ్ గురేవ్‌ కూడా ఆంక్ష‌ల జాబితాలో ఉన్నారు.


లండ‌న్‌లో బకింగ్‌హమ్ ప్యాలెస్ తర్వాత రెండో అతిపెద్ద ఎస్టేట్ విటాన్‌హాస్ట్ ఎస్టేట్ అత‌డి పేరుమీద ఉంది. ఫోసో ఆగ్రో ఫెర్టిలైజ‌ర్ స‌ప్ల‌య‌ర్ వ్య‌వ‌స్థాప‌కుడు కూడా ఈయనే. అలాగే, కరేబియా దీవుల్లోని భారీ విలాస నౌక అల్ఫా నెరోను కూడా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. గురేవ్‌తో పాటు అత‌ని కుమారుడి వ్యాపారాలను అమెరికా నిలిపి వేసింది. బ్యాంక్ లావాదేవీల‌ను స్తంభింపజేసి ఆస్తుల్ని సీజ్ చేసింది. రష్యా ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారి కిరిల్ దిమిత్రోవ్ భార్య నటాల్యా పొపొవాపై కూడా ఆంక్షలు విధించింది. పుతిన్ కుమార్తెలు నిర్వహిస్తోన్న ఇన్నోప్రాక్తికా ఐటీ సంస్థ కోసం పొపొవా పనిచేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ పేర్కొంది.


ర‌ష్యా దాడులతో ఉక్రెయిన్‌లోని అమాయ‌కులు ఇబ్బందిప‌డుతున్నారు, కానీ పుతిన్ స‌న్నిహితులు మాత్రం సంప‌న్నుల‌య్యార‌ని, విలాసవంతమైన జీవితాలను గ‌డుపుతున్నారని అమెరికా ట్రెజ‌రీ కార్య‌ద‌ర్శి జానెట్ యెల్లెన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ‘‘లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొన్న యుద్ధంలో రష్యన్ ప్రముఖులు, క్రెమ్లిన్ మద్దతుదారులను జవాబుదారులను చేయడానికి ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్న ప్రతి సాధనాన్ని ఉపయోగిస్తుంది’’ అని యెల్లెన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైప్పటి నుంచి 900 మందికిపైగా మాస్కో అధికారులకు అమెరికా వీసాలను బ్యాన్ చేసింది. దీంతో పాటు రష్యా సంపన్నులపై కూడా ఆంక్షలు విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com