తన తెలివి తేటలతో ప్రపంచానికి తెలిసిన ఎలాన్ మాస్క్ తాజాగా ట్విట్టర్ పై తన యుద్దంలో తన తెలివి ప్రదర్శన చేపట్టాడు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ తో కోర్టు వివాదంలో ‘భారత్’ అంశాన్ని వాడుకుని ప్రయోజనం పొందే ఎత్తుగడ వేశాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానంటూ ఘనంగా ఆఫర్ ఇచ్చి.. ఆ తర్వాత స్పామ్ ఖాతాల కచ్చితమైన వివరాలు ఇవ్వలేదన్న కారణంతో డీల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించడం తెలిసే ఉంటుంది. ఎలాన్ మస్క్ కొనుగోలు ఆఫర్ కు ట్విట్టర్ బోర్డు అనుకూలంగా నిర్ణయం తీసకోవడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత అతడు వెనక్కి తగ్గడంతో ట్విట్టర్ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
దీంతో ఎలాన్ మస్క్ సైతం ట్విట్టర్ పై డెలావేర్ కోర్ట్ లో ప్రతిదావా వేశాడు. అందులో భారత్ అంశాన్ని ప్రస్తావించాడు. ట్విట్టర్ భారత్ లో స్థానిక చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించాడు. ‘‘2021లో భారత సమాచార మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలు తెచ్చింది. దీనికింద సోషల్ మీడియా పోస్ట్ లపై ప్రభుత్వం విచారణ నిర్వహించొచ్చు. సమాచారాన్ని పెట్టిన వారిని గుర్తించాలని ఆదేశించడంతోపాటు, పాటించకపోతే విచారించగలదు’’ అని మస్క్ తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు.