ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని సమాచారం. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది ఒడిశా, ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. మిగతా చోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.