యూపీలోని ఎస్పీ పార్టీ నేత కారుకు జరిగిన యాక్సిడెంట్ తీరుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఆ యాక్సిడెంట్ ప్రమాదంగా జరిగిందా లేక ఉద్దేశ పూర్వకమా అన్న కోణంలో విచారణ సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఓ లారీ.. కారును ఢీకొట్టడమే కాదు.. 500 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఆ కారు కూడా సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిది. ఎస్పీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ యాదవ్ కర్హల్ కారులో ఉంటుండగానే ఇది జరిగింది. ఆదివారం రాత్రి దేవేంద్ర సింగ్ యాదవ్ తన ఇంటికి వెళ్తుండగా మెయిన్‌పురి సదర్ కొత్వాలి ప్రాంతంలోని భదవావర్ హౌస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో దేవేంద్ర సింగ్ యాదవ్ మెయిన్‌పురి సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
"సమాజ్ వాదీ పార్టీ నాయకుడి కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆ తర్వాత అది 500 మీటర్లకుపైగా లాక్కెళ్లింది. ఇటావాకు చెందిన ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది." అని మెయిన్‌పురి పోలీసు సూపరింటెండెంట్ కమలేష్ దీక్షిత్ తెలిపారు. అంతేకాదు ఇది హత్యా యత్నమా లేదా ప్రమాద వశాత్తు జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇదిలావుంటే మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి బలమైన కంచుకోటగా ఉంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి జిల్లా కర్హల్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.