ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుమారం రేపుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 05:05 PM

మహిళల  హత్యల  నేపథ‌్యంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. నిందితులను శిక్షించే చట్టాలే మహిళలకు యమపాశాలవుతున్నాయన్నారు. అత్యాచార దోషులకు ఉరిశిక్ష విధించే చట్టం వల్లే దేశవ్యాప్తంగా రేప్‌లు, హత్యలు ఎక్కువయ్యాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, నిరుద్యోగం తదితర సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో ఈ విధంగా స్పందించారు.


"నిర్భయ కేసు తర్వాత నిందితులను ఉరి తీయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆ తర్వాత కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అత్యాచారం తర్వాత మహిళల హత్య కేసులు పెరిగాయి. నిర్భయ కేసు తర్వాత దోషులకు ఉరిశిక్ష విధించే చట్టం కారణంగా అత్యాచారం తర్వాత హత్యలు ఎక్కువయ్యాయి. ఇది దేశంలో ప్రమాదకరమైన ధోరణి." అని అశోక్ గెహ్లాట్ అన్నారు.


అంతేకాదు దేశంలో అత్యాచారాల తర్వాత హత్యల ట్రెండ్ ప్రమాదకర స్థాయికి చేరుకుందని, బాధితులు నిందితులకు వ్యతిరేకంగా సాక్షిగా మారుతుందని భావిస్తున్నారని అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. అటువంటి పరిస్థితిలో నిందితుడు బాధితురాలిని చంపడం సరైనదని భావిస్తున్నాడని, దీనికి సంబంధించి నుంచి వస్తున్న నివేదికలు చాలా ప్రమాదకరమైన ధోరణిని చూపుతున్నాయని ఆయన అన్నారు.


అయితే అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ప్రకటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. కొన్నేళ్లుగా రాజస్థాన్‌లో అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. "గత మూడేళ్లలో రాజస్థాన్ యువ అమాయక బాలికలపై అఘాయిత్యాలకు కేంద్రంగా మారింది. తమ వైఫల్యాలను దాచడానికి వివాదాస్పద ప్రకటనలు చేస్తూ మాట మార్చే వారి కంటే దురదృష్టకరం మరొకటి ఉండదు." అని ఆయన అన్నారు.  ఇదిలావుంటే 2012లో ఢిల్లీలోని నిర్భయ గ్యాంగ్ రేప్‌ తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దాంతో కేంద్రం 2013 చట్టానికి కొన్ని సవరణలు చేసింది. ఈ మేరకు చట్టంలో సెక్షన్ 376, 376A, 376 డీ  కింద పునరావృత అపరాధిగా ఉన్న దోషికి మరణశిక్ష విధించడానికి సెక్షన్ 376ఇని జోడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com