బీజేపీది దోస్త్ వాద్’ ...కాంగ్రెస్ ది ‘పరివార్ వాద్’..మాది ‘భారత్ వాద్’ అంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పేదలకు ఉచిత పథకాల ప్రకటనను ప్రధాని మోదీ తప్పుపట్టడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఉచిత హామీలను తప్పుపడుతూ ప్రధాని మోదీ ‘ఫ్రీ వాదీ’ అని కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఉచితంగా మంచి నీళ్లు, ఉచిత విద్య అందజేయడం తప్పా అని కేజ్రీవాల్ నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వానికి ‘దోస్త్ వాద్’ అని.. వారి స్నేహితులకు ప్రయోజనం కల్పించుకోవడమే వారి లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితంగా ఉండే వారికి ఏకంగా రూ.పది లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని దేశ ద్రోహంగా ప్రకటించాలని.. దీని వెనుక ఉన్న వారిని జైలుకు పంపాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
బీజేపీది ‘దోస్త్ వాద్ (స్నేహితులకు ప్రయోజనం కల్పించుకోవడం)’ అని.. కాంగ్రెస్ ది ‘పరివార్ వాద్ (వారస రాజకీయం, కుటుంబ ప్రయోజనాలు చూసుకోవడం)’ అని.. అదే ఆమ్ ఆద్మీ పార్టీది మాత్రం ‘భారత్ వాద్’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించడం, పేదలను ఆదుకోవడమే తమ విధానమని చెప్పారు.
‘‘ఉచితంగా మంచి నీళ్లు, ఉచితంగా విద్య అందించడంలో తప్పు ఏముంది? వాటిని ఉచిత తాయిలాలు అని మాట్లాడటం ఏమిటి? 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో పేదలను బలోపేతం చేసే ప్రణాళికలను రూపొందించడానికి బదులు.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలు అని ఎగతాళి చేయడం ఏమిటి? మరోవైపు ఇదే సమయంలో పెద్ద పెద్ద కార్పోరేట్లకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటి?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.