ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడ్డీ రేట్లు పెంచిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్..కారణం ఇదే

business |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 07:18 PM

మన దేశంలోని ప్రతి బ్యాంకు తన వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్నాయి. తాజాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కూడా తన వడ్డీ రేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటును(ఎంసీఎల్ఆర్) పెంచింది. రుణాలపై అన్ని టెన్యూర్లపై 10 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్‌ను పెంచుతున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. ఈ కొత్త లోన్ వడ్డీ రేట్లు నేటి నుంచే అంటే ఆగస్టు 8, 2022 నుంచి అమల్లోకి వస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో.. రుణ గ్రహీతలు ఇక నుంచి పలు రుణాలపై ఈఎంఐ వాయిదాలను ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకులో ఇంటి రుణం, ఆటో రుణం, వ్యక్తిగత, ఇతర రుణాలు తీసుకున్న వారందరికీ ఈఎంఐలు పెరుగుతాయి.


హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం 7.80 శాతానికి పెరిగింది. ఇది అంతకుముందు 7.70 శాతంగా ఉండేది. అలాగే ఒక నెల వ్యవధి గల రుణాల ఎంసీఎల్ఆర్ 7.80 శాతానికి పెరిగింది. మూడు నెలల, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.85 శాతానికి, 7.95 శాతానికి పెరిగాయి. ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్ఆర్ 8.10 శాతానికి పెంచింది బ్యాంకు. చాలా మంది కన్జూమర్ లోన్లు ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్ఆర్‌తోనే అనుసంధానమై ఉంటాయి. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.20 శాతానికి, మూడేళ్ల కాల వ్యవధి ఎంసీఎల్ఆర్ 8.30 శాతానికి పెరిగింది.


గత నెలలో కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన ఎంసీఎల్ఆర్ రేట్లను 20 బేసిస్ పాయింట్లు పెంచింది. అంతేకాక జూన్ నెలలో కూడా 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ లెక్కన చూస్తే ప్రతి నెలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతోంది. దీనికి గల కారణం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచడమే. శుక్రవారం వెల్లడించిన పాలసీ రివ్యూలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. మే నెలలో కూడా రెపోను 40 బేసిస్ పాయింట్లు, జూన్ నెలలో 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ ప్రకటన చేసింది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ ఈ వడ్డీ రేట్లను పెంచుతోంది. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపుతో.. బ్యాంకులలో రుణాల వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com