మనం ప్రతి నెల జీతం తీసుకొంటాం. అంతే కాదు వచ్చే నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తామంటే ఎగిరి గంతేస్తాం. కానీ బిలీనియర్ ముకేశ్ అంబానీ తన .నెలజీతం తీసుకోలేదటా. అది కూడా వరుసగా రెండో ఏడాది కూడా జీరో జీతాన్ని తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తన ఫ్లాగ్‌షిప్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఎలాంటి జీతాన్ని ఆయన పొందలేదు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినప్పటి నుంచి ఆయన వేతనాన్ని తీసుకోవడం లేదు. స్వచ్చందంగానే తన రెమ్యూనరేషన్ వదులుకుంటున్నారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సమర్పించిన వార్షిక రిపోర్టులో ముకేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి వేతనాన్ని పొందలేదని పేర్కొంది.
2020 జూన్‌లో కరోనా నేపథ్యంలో ఆయన జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకుకోవాలని నిర్ణయించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ డీ అంబానీ తెలిపారు. 2021-22లో కూడా ఆయన వేతనాన్ని పొందలేదు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాలు ముకేశ్ అంబానీ ఛైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎలాంటి అలవెన్స్‌లను, కమిషన్లను, స్టాక్ ఆప్షన్లను, రిటైరల్ ప్రయోజసనాలను రిలయన్స్ నుంచి ఆయన పొందలేదు.
అంతకుముందు వరకు ఛైర్మన్‌గా, ఎండీగా 2008-09 నుంచి ఆయన రూ.15 కోట్ల వేతనాన్ని పొందారు. 11 ఏళ్లుగా ఆయన అదే వేతనాన్ని తీసుకున్నారు. ముకేశ్ అంబానీ ఎలాంటి జీతం తీసుకోనప్పటికీ.. ఆయన కజిన్లు నిఖిల్, హితల్ మేస్వానీలు రూ.24 కోట్ల చొప్పున వేతనాన్ని పొందారు. ఈసారి దీనిలో రూ.17.28 కోట్ల కమిషన్లు కూడా కూడా కలిసి ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎంపీఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ రెమ్యూనరేషన్లు కాస్త తగ్గాయి. ప్రసాద్ 2021-22లో రూ.11.89 కోట్లు పొందగా.. కపిల్ రూ.4.22 కోట్లను పొందారు.
అంబానీ భార్య నీతా కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సిట్టింగ్ ఫీజు కింద రూ.5 లక్షలను, కమిషన్ల కింద రూ.2 కోట్లను పొందారు. అంతకుముందు ఆమె సిట్టింగ్ ఫీజు రూ.8 లక్షలుగా, కమిషన్ రూ.1.65 కోట్లుగా ఉండేది. అంబానీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో మేస్వానీ బ్రదర్స్, ప్రసాద్, కపిల్‌లు హోల్ టైమ్ డైరెక్టర్లుగా ఉన్నారు.