దేశ వ్యాప్తంగా దాడులను మమ్మురం చేసిన ఐటీశాఖ తాజాగా మహారాష్ట్రలోనూ పలు చోట్ల రాయిడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో మహారాష్ట్రకు చెందిన ఉక్కు, రియల్ ఎస్టేట్, బట్టల వ్యాపారికి చెందిన నివాసాల్లో దాడులు చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని రూ. 58 కోట్ల నగదు, 32 కిలోల బంగారం సీజ్ చేశారు. అలాగే రూ.390 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.
ఆదాయపు పన్ను శాఖ నాసిక్ విభాగం ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు జల్నా, ఔరంగాబాద్ నగరాల్లోని సదరు వ్యాపారి కార్యాలయాలు, నివాసాల్లో ఈ సోదాలు నిర్వహించింది. పట్టుబడిన నగదును లెక్కించేందుకు ఐటీ డిపార్ట్‌మెంట్ కు 13 గంటల సమయం పట్టింది. మొత్తం 260 మంది అధికారులు, ఉద్యోగులు ఐదు బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు.