కనికట్టు అంటే అందరికీ తెలిసిందే. లేనిది ఉన్నట్టుగా....ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది. అలాంటి కనికట్టు సైకిల్ ఇపుడు వార్తల్లో నిలిచింది. పైన ఫొటోలో ఓ సైకిల్ కనిపిస్తోందా?.. ఎవరైనా ఏదో పొలమో, కొండలు గుట్టల ప్రాంతంలోనో షికారుకు వెళ్లి ఆగినట్టు ఉన్న ఈ సైకిల్ కు ఏమైందో గమనించారా? దానికి ముందు చక్రం పరిస్థితి ఏమిటో చూశారా? అసలు ఈ సైకిల్ కు ముందు చక్రం ఉన్నదీ, లేనిదీ తెలుస్తోందా?.. ఇది కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఫొటో.. దానిపై హాట్ హాట్ గా సాగుతున్న టాపిక్ మరి. ఆన్ లైన్ చర్చా వేదిక అయిన రెడ్డిట్ వెబ్ సైట్లో ఓ నెటిజన్ ఈ ఫొటోను పోస్ట్ చేయడంతో ఈ గందరగోళం మొదలైంది. మరి నిజానికి ఈ సైకిల్ కు ముందు చక్రం ఉంది. జాగ్రత్తగా గమనిస్తే.. కనిపిస్తుంది.
ఈ సైకిల్ ను తీసుకుని బురదలో ప్రయాణించిన వ్యక్తి దాన్ని ఓ చోట ఆపారు. బురదలో వెళ్లడంతో సైకిల్ ముందు టైరుకు పూర్తిగా అంటుకుని ఉంది. అయితే సైకిల్ టైరుకు అంటిన బురద మట్టిలాంటి మట్టి ఉన్న చోట దానిని ఆపారు. ముందు చక్రాన్ని సూటిగా ఉంచి, రెండు వైపులా ఉన్న ఇనుప పైపులకు సమాంతరంగా వచ్చేలా చూసి.. ఫొటో తీశారు. అందువల్ల టైరుకు అంటిన బురద కింద ఉన్న మట్టిలో కలిసిపోయి.. దృష్టి భ్రాంతి (ఆప్టికల్ ఇల్యూషన్) ఏర్పడింది. ఇలాంటి ఫొటోలను మెదడు ప్రాసెస్ చేసేటప్పుడు దాదాపు సరిసమానంగా ఉన్న రంగులను కలిపి చూస్తుందని.. అందువల్ల ఒకే రంగులో ఉన్నవన్నీ ఒకే వస్తువులా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ముందు చక్రం టైరు మనం గమనించలేకుండా.. కింద నేలలో కలిసిపోయినట్టు కనిపిస్తుందని వివరిస్తున్నారు.
సరైన కోణంలో, సరైన లైటింగ్, రంగుల మిశ్రమంలో ఫొటోలు తీస్తే ఇలాంటి దృష్టి భ్రాంతులను సులువుగా సృష్టించవచ్చని ఫొటోగ్రఫీ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. చాలా మంది నిపుణులు ఈ చిత్రంపై జరిగిన చర్చలో తమ అభిప్రాయాలను వివరించారు. అయితే ఇంత వివరణ ఇచ్చినా.. చాలా మంది అసలు ఈ చిత్రంలో సైకిల్ కు ముందు చక్రం లేనే లేదని వాదిస్తూ రావడం గమనార్హం. వెనుక చక్రం కూడా సరిగా కనిపించకపోవడంతో.. అసలు రెండు చక్రాలూ లేవన్నవారూ ఎంతో మంది ఉన్నారు.