ఎవరి విమర్శలైన కేవలం జడ్జిమెంట్లపై మాత్రమే ఉండాలని, వ్యక్తిగతంగా జడ్జీలపై ఉండరాదని సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ పేర్కొన్నారు. కోర్టులు వెలువరించే తీర్పులను విమర్శిస్తే నష్టం లేదని... కానీ, వ్యక్తిగత కారణాలతో జడ్జిలను విమర్శించడం సరికాదని ఆయన అన్నారు. ఆగస్ట్ 27న ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ నుంచి యూయూ లలిత్ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జడ్జిలు కేవలం వారి జడ్జిమెంట్లు, ఆర్డర్ల ద్వారా మాత్రమే మాట్లాడతారని చెప్పారు. కాబట్టి విమర్శలు కేవలం జడ్జిమెంట్లపై మాత్రమే ఉండాలని అన్నారు.
ఎవరైనా సరే జడ్జిమెంట్లను మాత్రమే చూడాలని... వాటి వెనుకున్న జడ్జిలను చూడరాదని ఆయన చెప్పారు. జడ్జిమెంట్లపై కౌంటర్ వేసే అవకాశం కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. జడ్జిలపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోందని... వీటిపై జడ్జిలు వెంటనే ప్రతిస్పందించరని... దీన్ని బలహీనతగా చూడకూడదని హితవు పలికారు.