బీహార్ రాష్ట్రంలో నూతన మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ మంత్రివర్గంలో ఆర్జేడీకి సింహ భాగం దక్కగా..లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు కూడా చోటు దక్కడం విశేషం. బీహార్‌లో నూతన మంత్రి వర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో 16 మంది ఆర్జేడీకి చెందిన వారు ఉండగా.. నితీశ్ కు చెందిన జేడీయూ నుంచి 11 మంది ఉన్నారు.
ఇక కాంగ్రెస్ కు చెందిన ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది. హిందుస్తానీ ఆవామ్ మోర్చా ఒకరు, మరో స్వతంత్ర ఎమ్మెల్యేకు కూడా నూతన మంత్రి వర్గంలో చోటు లభించింది. తేజస్వి యాదవ్ అన్న, లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.