ఏపీలో విపరీతంగా పెరిగిన మద్యం ధరలపై ఎందుకు మౌనం దాల్చుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పై సినీ నటుడు శివాజీ మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో మద్యం అమ్మకాలపై ఉండవల్లి విమర్శలు చేశారని, మద్యం ధర ఎంత ఉందో అప్పుడు చూపించారని, ఇప్పుడున్న మద్యం ధరపై ఆయన మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కు భజన చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని శివాజీ అన్నారు. ఏపీని అప్పులపాలు చేసిన జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయ నాయకులు అవినీతి, అప్పులు లేకుండా పరిపాలిస్తారని చెప్పారు.
ఇదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కూడా శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. మాజీ ఐఏఎస్ అధికారులను కాకుండా పార్టీ నేతలను, కార్యకర్తలను నమ్ముకుంటే మంచిదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మంచి, చెడ్డలను ఆలోచించి ఓట్లు వేయాలని అన్నారు.