నేపాల్ గూర్ఖాలకు సూటూ బూటూ తగిలించి ఎంవోయూలు చేసిన ఘనత చంద్రబాబుది అని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పేర్కొన్నారు. ఓవైపు తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, ప్రతిదీ తామే చేశామంటూ చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో పెట్టుబడుల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడిందని విమర్శించారు. కానీ, ఇప్పుడు తాము ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. వనరులను గుర్తించి రాష్ట్రాన్ని దేశవిదేశాలకు ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు.
ఇదిలావుంటే తమ హయాంలో వచ్చిన పరిశ్రమలకు సీఎం జగన్ ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే విపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మంత్రి అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. అందుకే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు చేయూతనిస్తోందని, ఎంఎస్ఎంఈల పునరుద్ధరణకు రూ.1463 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చామని వెల్లడించారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీలకు స్పష్టం చేశామని తెలిపారు.