ఉచితాలు వద్దు అని ప్రచారం చేస్తున్న బీజేపీ దాని మిత్ర పార్టీలకు షాక్ ఇచ్చేలా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పేదలందరికీ ఉచిత విద్య, అందరికీ తాగునీరు పథకాలు కూడా ఉచిత హామీలే అవుతాయా? అంటూ అసహనం వెలిబుచ్చింది. ఎన్నికల వేళ ప్రచారాల్లో ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఉచిత హామీల అంశం మరింత జటిలంగా మారుతోందని పేర్కొంది. పేదలందరికీ ఉచిత విద్య, అందరికీ తాగునీరు పథకాలు కూడా ఉచిత హామీలే అవుతాయా? అంటూ అసహనం వెలిబుచ్చింది.
ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్ ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ ను బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేయగా, ఈ విషయంలో తమ వాదనలు కూడా వినాలంటూ ఆప్, కాంగ్రెస్, డీఎంకే పార్టీలు పిటిషన్లు వేశాయి. ఉచిత హామీల అంశంపై సుప్రీం జోక్యం చేసుకోవాలని పిటిషన్ దారు కోరారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ, ఏవి ఉచితాలు? ఏవి కావు? అనే విషయంపై నిర్దిష్ట అభిప్రాయాలు వెలువరించారు.
"హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను మేం నిరోధించలేం. అయితే ఏవి సరైన హామీలు అన్నదే ప్రశ్న. ఉచిత విద్య అనే పథకాన్ని మనం ఉచిత హామీగా అభవర్ణించగలమా? ఉచిత తాగునీరు, అవసరమైన మేరకు కొన్ని యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఉచిత హామీలు అనగలమా? వినియోగదారుల ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను ఉచితంగా ఇస్తామంటే అవి సంక్షేమ పథకాలు అవుతాయా?
ఈ నేపథ్యంలో, ప్రజాధనాన్ని సవ్యరీతిలో ఖర్చు చేయడం ఎలాగన్నదే ఇప్పుడు తొలిచివేస్తున్న ప్రశ్న. కొందరేమో నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటున్నారు... మరికొందరేమో దాన్ని సంక్షేమం అంటున్నారు. ఇలాంటి అంశాలన్నీ రాన్రాను సంక్లిష్టంగా మారుతున్నాయి. అందుకే దీనిపై విస్తృత అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం" అని సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు.
రాజకీయ పక్షాలు ఇచ్చే వాగ్దానాలొక్కటే ఆ పార్టీలు నెగ్గడానికి ప్రాతిపదిక కాదని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ఎంన్ఆర్ఈజీఏ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ) పథకాన్నే తీసుకుంటే, దీని ద్వారా పౌరులకు గౌరవప్రద జీవనం సాధ్యమైందని వివరించారు. అంతేకాదు, కొన్ని పార్టీలు హామీలు ఇచ్చినా సరే ఎన్నికల్లో గెలవడంలేదన్న అంశాన్ని కూడా గమనించాలని సీజేఐ పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ వచ్చేవారం ఉంటుందని వెల్లడించారు.