ఏపీలోని వైసీపీ సర్కార్ పై సమరం సాగించేందుకు ఆ రాష్ట్ర బీజేపీ సన్నద్దమవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెటైర్లు వేసింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీతో పాటు జనసేన పార్టీ ఓ రేంజ్‌లో సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ అయితే, ఏకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నిర్వహించింది. తాజాగా, బీజేపీ కూడా రోడ్ల విషయంలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. జనసేన మాదిరిగానే కార్టూన్లతో బీజేపీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఓ సెటైరికల్ కార్టూన్ విడుదల చేసింది.
‘జగన్ రోడ్లు- నరకానికి దారులు’ పేరుతో బీజేపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్టు పెట్టింది. ఈ సందర్భంగా సదరు పోస్టులో ‘వైసీపీ ప్రభుత్వ సిత్రాలు.. రాష్ట్ర రోడ్లు’ అంటూ ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది. ఈ కార్టూన్‌లో విజయవాడకు 5 కిలో మీటర్ల దూరంలో కారులో వెళ్తున్న ఓ వ్యక్తి.. రోడ్డు పక్కగా కూర్చుని మద్యం తాగుతున్న ఓ వ్యక్తిని ‘ఈ రోడ్డు ఎక్కడికి వెళుతుంది’ అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా.. ‘ఏముంది? డైరెక్ట్‌గా పైకే’ అంటూ సమాధానం ఇస్తాడు.
అంతేకాకుండా ‘ఈ రోడ్డు ఎక్కడికి పోతుందో తెలియదు గానీ.. నీ కారేమో షెడ్డుకు, నువ్వేమో హాస్పిటల్‌కి మాత్రం పక్కాగా వెళతారు’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఇటీవల విశాఖపట్నంలో ఓ వ్యక్తిని రోడ్డుపై ఉన్న గుంత మింగేసింది. ఈ నెల 4న రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్‌కు బైక్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యంలో రోడ్డుపై గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి.