సినీ ప్రపంచం ఒక భారీ ‘బ్రూటల్ మర్డర్’కు సాక్ష్యం కాబోతోందని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జోస్యం చెప్పారు. టెక్నాలజీ మారుతున్న కొద్దీ మార్పులు రావడం సహజమే అయినా, 'సీడెన్స్ 2.0' (Seedence 2.0) వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్ రాకతో ప్రస్తుత సినిమా ఎకోసిస్టమ్ పూర్తిగా అంతరించిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వందల కోట్ల బడ్జెట్లు, వేలమంది టెక్నీషియన్లతో నడిచే ప్రస్తుత చిత్ర పరిశ్రమ ఇకపై చరిత్రగా మిగిలిపోనుందని ఆయన విశ్లేషించారు.ప్రస్తుతం అత్యంత ఖరీదైన సినిమాలు తీస్తూ రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారని, ఆయనకున్న అసమానమైన క్రియేటివ్ ఊహాశక్తి వల్ల వేల కోట్లు రాబట్టడం సాధ్యమవుతోందని వర్మ పేర్కొన్నారు. అయితే, 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో చిన్న చిన్న పట్టణాలు, పల్లెల్లో అంతకంటే మెరుగైన ఊహాశక్తి ఉన్నవారు ఎంతోమంది ఉన్నారని.. కానీ, వారికి పరిశ్రమలోకి వచ్చే అవకాశం గానీ, పెట్టుబడి పెట్టే స్తోమత గానీ లేదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఈ అవకాశాలన్నీ కొందరి చేతుల్లోనే ఉండగా.. 'సీడెన్స్ 2.0' ఆ తలుపులను తన్ని పారేసిందని ఆయన పేర్కొన్నారు."కోట్లాది రూపాయల బడ్జెట్, నెలల తరబడి షూటింగ్స్ అవసరం లేదు. నటులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, ఫైట్ మాస్టర్లు, లైట్ బాయ్స్.. ఇలా ఏ భారీ సైన్యం లేకుండానే థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు వస్తాయి. నటీనటుల డేట్స్, వారి మూడ్స్ తో పని ఉండదు. కేవలం ఒక డిస్క్రిప్టివ్ ప్రాంప్ట్ ఇస్తే చాలు... సినిమాటిక్ విజువల్స్, సౌండ్ డిజైన్‌తో కూడిన సీన్లు నిమిషాల్లో తయారవుతాయి" అని తెలిపారు."సినిమా ఇండస్ట్రీ ఒక వంద ఏళ్ల పాటు డైనోసార్లలా రాజ్యం చేసింది. కానీ ఇప్పుడు ఏఐ అనే ఒక ఆస్టరాయిడ్ (ఉల్క) భూమిని తాకింది. ఇది నెమ్మదిగా కాదు... చాలా ఘోరంగా ఇండస్ట్రీని చంపేస్తుంది" అని వర్మ పేర్కొన్నారు. అయితే ఇది సినిమాకు నిజమైన స్వేచ్ఛను ఇస్తుందని, టాలెంట్ ఉన్న ఎవరైనా ముంబై వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని సినిమాలు తీయొచ్చని ఆయన వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa