ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ రివ్యూ : ‘ప్రేమ పిపాసి’

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2020, 04:39 PM

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ నిర్మాత. మురళీ రామస్వామి దర్శకుడు. ఈ చిత్రన్నీ నేడు విడుదల చేశారు.
కథ : బావ (జిపిఎస్).. పేరుకి తగ్గట్లుగానే మంచి కళా పురుషుడు. అవకాశం దొరికినప్పుడల్లా అమ్మాయిలతో సరసాలాడుతూ ఉన్న క్రమంలో బాలా (కపిలాక్షి మల్హోత్రా)ను చూసి మన ప్రేమపిపాసి ఇట్టే ప్రేమలో మునిగి తేలతాడు. ఇంతకీ మన పిపాసి ప్రేమ ప్రతిపాదనను ఆ బాలామణి అంగీకరించిందా ? లేదా ? అసలు ఈ ప్రేమపిపాసి అయిన ‘బావ’ ఎవరు ? అతని గత కథ ఏమిటి? గతంలో బావకు బాలాకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఇలాంటి భయంకరమైన విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని వీక్షించాల్సిందే.
ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాలో హీరో జిపిఎస్ వివిధ షేడ్స్ ఉన్న తన పాత్రలో తన నటవిశ్వరూపం చూపించి (ఓ యాంగిల్ లో).. తెలుగు ప్రేక్షులను ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. ప్రధానంగా ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ సీన్స్ లో అవలీలగా నటిస్తే.. సెకెండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో విచ్చలవిడిగా రెచ్చిపోయి మరి నటించాడు. మొత్తానికి జిపిఎస్ నటన గురించి క్లుప్తంగా చర్చించుకోవటమే మంచింది. ఇక హీరోయిన్ కపిలాక్షి మల్హోత్రా తన అందచందాలను ప్రదర్శించడంలో ఏ మాత్రం మొహమాట పడకుండా తన వంతుపాత్రను తానూ సమర్ధవంతంగా పోషించింది. సీనియర్ నటుడు సుమన్ ఎప్పటిలాగే తన పాత్రలో బాగా నటించి ఈ చిత్రానికి కాస్త అదనపు ఆకర్షణ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే టీజింగ్ సాంగ్ బాగుంది. అలాగే మొదటి భాగంలో వచ్చే కొన్ని రొమాంటిక్ ఎపిసోడ్లు యువ ప్రేక్షకులను మంత్రముగ్దులను చెయ్యకపోయినా రజింపచేస్తాయి.
మైనస్ పాయింట్స్ : ప్రథమార్ధంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ, బాగా నిస్తేజంగా అనిపిస్తాయి. దర్శకుడు కొన్ని లవ్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. సినిమా మాత్రం ఆసక్తికరంగా సాగదు. మెయిన్ గా సినిమాలో స్టోరీ చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా అనిపించదు. స్క్రిప్ట్ లో బలం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా విషయం లేని సీన్స్ తో పాటు కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు.
సాంకేతిక విభాగం : సమకాలీన ప్రేమకథలలో వాస్తవ సంఘటనలను చూపించాలనుకున్న దర్శకుడు మురళి రామస్వామి ఉద్దేశం మంచిదే, కానీ దానికి తగ్గ కథాకథనాలను రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కీలక దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. ఇక సంగీత విషయానికి వస్తే.. రెండు పాటలు బాగున్నా… నేపధ్య సంగీతం పర్వాలేదనిస్తోంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఇక ఈ చిత్రానికి నిర్మాణ విలువలు చాల బాగున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ బ్యూటిఫుల్ లొకేషన్స్ కోసం.. అవుట్ డోర్ లో ఎక్కువ షెడ్యూల్స్ పెట్టారు.
తీర్పు: ‘ప్రేమ పిపాసి’గా వచ్చిన ఈ యవ్వన ప్రేమకథ, సెకెండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ తో పాటు హీరో జిపిఎస్ బాధాకరమైన ప్రదర్శన కూడా ఆకట్టుకుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో సరైన ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, అలాగే సినిమాలోని మెయిన్ కంటెంట్ స్ట్రాంగ్ గా ఎలివేట్ కాకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకోదు.
నటీనటులు :  జిపిఎస్‌ , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌ పుత్‌, మమత శ్రీ చౌదరి, ‘ఢీ జోడి ఫేమ్‌’ అంకిత , బిగ్‌ బాస్‌ ఫేమ్‌ బందగీ కర్ల , సంజన చౌదరి , సుమన్‌ , భార్గవ్‌ , షేకింగ్‌ శేషు, జబ్బర్దస్థ్‌ రాజమౌళి, ఫసక్‌ శశి, ఫన్‌ బకెట్‌ భరత్‌ తదితరులు
రచన – దర్శకత్వం : మురళి రామస్వామి (ఎమ్‌ .ర్‌ ), నిర్మాత‌లు : పియస్‌ రామకృష్ణ (ఆర్కే), సంగీతం :  ఆర్స్‌, సినిమాటోగ్రఫర్ : తిరుమల రోడ్రిగ్జ్‌ ,ఎడిటర్ : ఎస్‌ శివ కిరణ్‌. 


రేటింగ్ : 2.25/5. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa