త్వరలోనే సినిమా షూటింగులు, థియేటర్ లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా? లాక్ డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన సినీపరిశ్రమను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సినీపరిశ్రమ ఇబ్బందులపై కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, సి. కళ్యాణ్, రాజమౌళి తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ అందరి అభిప్రాయాలు తీసుకొని షూటింగులు, థియేటర్ల పునఃప్రారంభంపై ముందుకెళ్తామని చెప్పారు. షూటింగుల వద్ద, థియేటర్ ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకున్నందుకు చిరంజీవిని, కమిటీ సభ్యులను అభినందించారు.