నటీనటులు: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజన సింఘీ, సైఫ్ అలీ ఖాన్ తదితరులు
బ్యానర్: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
సినిమాటోగ్రఫీ: సేతు
సంగీతం: ఏఆర్ రెహమాన్
దర్శకత్వం: ముఖేష్ చబ్రా
విడుదల తేదీ: 24 జూలై 2020
ప్లాట్‌ఫామ్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించాడన్నది నమ్మక తప్పని నిజం. మరణించకముందు అతడు నటించిన చివరి సినిమాలో కొద్ది రోజుల్లో మరణించే వ్యక్తి పాత్ర పోషించడం యాదృశ్చికం. సినిమా చూస్తున్న సమయంలో అతడు మరణిస్తాడని కాకుండా, మరణించాడని గుర్తుకు వస్తుండటం విషాదం. అంత విషాదంలోనూ నవ్వులు పూయించడం దర్శకుడి గొప్పదనం. వెరసి... శుక్రవారం రాత్రి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైన సుశాంత్ చివరి సినిమా 'దిల్ బేచారా' విభిన్న అనుభూతుల మేళవింపును ప్రేక్షకులకు అందిస్తుంది.
కథ:
థైరాయిడ్ కాన్సర్‌తో బాధపడుతున్న బెంగాలీ అమ్మాయి కిజీ బసు (సంజన సంఘి). ఎప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ బోరింగ్ లైఫ్ గడుపుతుంది. ఇమ్మాన్యూల్ రాజ్‌కుమార్ జూనియర్ అలియాస్ మ్యాని (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్) కూడా క్యాన్సర్ పేషెంటే. కానీ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ జాలీగా గడుపుతుంటాడు. అతడికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌లా హీరో అవ్వాలనేది కోరిక. స్నేహితులతో కలిసి సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తుంటాడు. అందులో కథానాయికగా కిజీ బసును సెలెక్ట్ చేసి, ఆమెను ఒప్పిస్తారు. సినిమా చిత్రీకరణలో ఇద్దరూ ప్రేమలో పడతారు. చివరకు, ఏమైంది? ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనేది మిగతా సినిమా. మధ్యలో కిజీ బసు కోరిక ఏంటనేది ఆసక్తికరం.
విశ్లేషణ:
కథగా చెప్పుకుంటే 'దిల్ బేచారా' ఏమీ కొత్తది కాదు. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం నాగార్జున, గిరిజ జంటగా మణిరత్నం తీసిన 'గీతాంజలి' కథే ఈ సినిమా. అందులో నాగార్జున క్యారెక్టర్ డల్‌గా ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో అపోజిట్ అన్నమాట. హీరో యాక్టివ్ అయితే... హీరోయిన్ డల్ క్యారెక్టర్.
'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' నవల ఆధారంగా సినిమా తెరకెక్కింది. సినిమా ఓపెనింగ్ సన్నివేశంలో హీరోయిన్ మాటలతో ముగింపు ఎలా ఉండబోతుందో ఊహకు వస్తుంది. పైగా, హీరో హీరోయిన్లు ఇద్దరూ క్యాన్సర్ పేషెంట్లు. అయినా సరే సినిమాను సరదాగా నడిపించడంలో దర్శకుడు ముఖేష్ చబ్రా సక్సెస్ అయ్యాడు. రజనీకాంత్ నేపథ్యంలో సన్నివేశాలు, షూటింగ్ సన్నివేశాలలో ఫన్ వర్కవుట్ అయ్యింది. ప్రేమ, జీవితం గురించిన అమితాబ్ భట్టాచార్య రాసిన కొన్ని డైలాగులు నవ్విస్తాయి. ఆలోచనలో పడేలా చేస్తాయి. మధ్య మధ్యలో బోరింగ్ మూమెంట్లు ఉన్నప్పటికీ సినిమాను బాగానే తీశాడు. నిడివి తక్కువ ఉండటం సినిమాకి ప్లస్ పాయింట్. ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అందుకు, సుశాంత్ మరణించడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
యూరోప్ స్టయిల్ లో సినిమాను తెరకెక్కించారు. సేతు సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాకి ఒక ఫీల్ తీసుకొచ్చింది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్ళింది.
ప్లస్ పాయింట్స్:
సుశాంత్ నటన
ఏఆర్ రెహమాన్ సంగీతం
హృద్యమైన సన్నివేశాలు
వినోదం
మైనస్ పాయింట్స్:
'గీతాంజలి' గుర్తు రావడం
ఊహించదగ్గ సన్నివేశాలు
ముగింపు
ప్రారంభంలో కథను చెప్పడం
నటీనటుల పనితీరు:
సుశాంత్ ఎంత ప్రతిభ కల నటుడు అనేది ఈ సినిమాతో మరోసారి తెలుస్తుంది. తన నటనతో పలు సన్నివేశాలను నిలబెట్టాడు. ఏడేళ్ల సినీ ప్రయాణంలో ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత వినోదాత్మక పాత్రను అతను ఎప్పుడూ చేయలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో ఎక్సలెంట్ అంతే. తొలి చిత్రమైనా సంజనా సింఘి ఆకట్టుకుంటుంది. తెరపై తాను బాధపడుతుంటే ప్రేక్షకులు కూడా బాధ పడతారు. అంత అద్భుతంగా నటించింది. అతిథి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ఆకట్టుకుంటారు. అయితే, అతడి పాత్ర, సన్నివేశాలను సరిగా తీర్చిదిద్దలేదు.
తీర్పు:
సినిమాలో హీరోయిన్ కిజీ బసు తన అభిమాన సంగీత దర్శకుడు అర్ధాంతరంగా ఎందుకు కెరీర్ ముగించాడో తెలుసుకోవాలని పరితపిస్తుంది. తన మదిలో ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం ప్యారిస్ వెళుతుంది. సినిమా చూస్తున్నప్పుడు కథపై కాన్సంట్రేషన్ కంటే ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ సుశాంత్ ఎందుకు అర్ధాంతరంగా కెరీర్ ఎందుకు ముగించాడో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఇక, సినిమా విషయానికి వస్తే... అద్భుతమని చెప్పలేం. కానీ, ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చే సినిమా. నిజ జీవితంలో బలవన్మరణానికి పాల్పడిన సుశాంత్, తెరపై మరణించే సన్నివేశం వస్తుంటే ఆటోమేటిక్ గా కన్నీళ్లు వస్తాయి. చివరగా... లేట్ యాక్టర్ సుశాంత్ కి ఈ సినిమా అద్భుతమైన నివాళి అని చెప్పవచ్చు.
రేటింగ్: 3/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa