సాంకేతికత పెరిగే కొద్దీ వింతలు కూడా పెరుగుతుంటాయి. కానీ ఉత్తరప్రదేశ్ పోలీసులు చేసిన ఒక పని.. దేశవ్యాప్తంగా నవ్వుల పాలయ్యేలా చేసింది. అంతేకాకుండా వారిని తీవ్ర విమర్శలకు దారితీసింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో అక్రమ వలసదారుల గుర్తింపు కోసం తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ఒక వ్యక్తి వీపుపై స్మార్ట్ ఫోన్‌ను ఉంచి 'స్కాన్' చేస్తున్నట్లుగా వ్యవహరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సూపర్ మార్కెట్‌లో బార్‌కోడ్ స్కాన్ చేసినట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే..?
డిసెంబర్ 23వ తేదీన ఘజియాబాద్‌లోని ఒక ప్రాంతానికి స్థానిక ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో పోలీసు బృందం తనిఖీ వాహనంతో చేరుకుంది. పౌరసత్వ ధృవీకరణ డ్రైవ్‌లో భాగంగా అక్కడి నివాసితులను పత్రాలు చూపాలని కోరారు. అయితే ఆ సమయంలో తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో ఒక పోలీస్ అధికారి తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను ఒక వ్యక్తి వీపుపై ఆనించి ఏదో చెక్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఆపై మీరు బంగ్లాదేశీయులే అని సదరు వ్యక్తికి చెప్పారు. ఈ ఫోన్ అక్రమ వలసదారులను కనిపెడుతుందంటూ వివరించారు. ఈ వింత చర్యపై నెటిజన్లు అసలు అలాంటి టెక్నాలజీ ఉందా? అంటూ పోలీసులను ఏకిపారేస్తున్నారు.
ముఖ్యంగా వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి వదిన రోష్ని ఖాతూన్ మీడియాతో మాట్లాడుతూ.. "పోలీసులు మా దగ్గరకు వచ్చి పత్రాలు అడిగారు. మేము మా ఆధార్ కార్డులు, ఇతర చట్టబద్ధమైన ఆధారాలను చూపించాము. అయితే వారు తమ వద్ద ఒక కొత్త మిషన్ ఉందని.. దానిని వీపుపై పెడితే మీరు బంగ్లాదేశీయులో కాదో తెలిసిపోతుందని సరదాగా అన్నారు. నిజానికి అక్కడ ఎలాంటి మిషన్ లేదు. కేవలం తమ చేతిలోని ఫోన్‌ను నా మరిది వీపుపై ఆనించి తమాషా చేశారు" అని వివరించారు.
కుటుంబ పెద్ద రబీలా మాట్లాడుతూ.. "మా వీపుపై స్కాన్ చేస్తే వెంటనే మా మూలాలు తెలిసిపోతాయని పోలీసులు చెప్పారు. మేము 1986 నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాది బీహార్‌లోని అరారియా జిల్లా. మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు" అని తెలిపారు. పోలీసులు దీనిని ఒక జోక్‌గా భావించినప్పటికీ.. నెటిజన్లు మాత్రం దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. "చదువుకోని అమాయక ప్రజలను ఇలాంటి మూఢ నమ్మకాలతో భయపెట్టడం ఎంతవరకు సమంజసం?" అని ప్రశ్నిస్తున్నారు.
ఇది కేవలం అవమానకరమైన చర్యే కాకుండా.. శాస్త్రీయత లేని వ్యవహారమని పౌర హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. వరుసగా రెండు సార్లు ఇలాంటి తనిఖీలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ వైరల్ వీడియోపై కానీ, పోలీసుల ప్రవర్తనపై కానీ ఘజియాబాద్ పోలీసులు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అక్రమ వలసదారులను గుర్తించే క్రమంలో పారదర్శకమైన పద్ధతులు పాటించాల్సింది పోయి ఇలాంటి వింత చేష్టలకు పాల్పడటం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa