ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ద్వీపాన్ని బీజింగ్ ఆక్రమిస్తే.. భారత్‌కు నష్టమేంటి

international |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 09:37 PM

‘మేం తైవాన్‌ను విలీనం చేసుకోవడాన్ని ఎవరూ ఆపలేరు’.. న్యూ ఇయర్ సందర్భంగా చైనా అధినేత జిన్‌పింగ్ చేసిన ప్రకటన ఇది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలను సైతం చైనా చేపట్టింది. ద్వీప దేశం చుట్టూ భారీగా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను మోహరించి కవ్వింపు చర్యలకు దిగింది. 2049 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే తైవాన్‌ను తనలో కలిపేసుకోవాలనే పట్టుదలతో చైనా ఉంది. ఈ నేపథ్యంలో అసలు తైవాన్ దేశం ఎలా ఏర్పాటైంది? చైనా-తైవాన్ సమస్య ఏమిటి? ఇందులో అమెరికా ప్రమేయం ఏమిటి? తైవాన్‌ను చైనా ఆక్రమించుకుంటే భారత్‌కు వచ్చే ఇబ్బందులు ఏంటనేది చూద్దాం..!!


అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యల్లో ఒకటి


ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యల్లో చైనా, తైవాన్ వివాదం ఒకటి. ఈ వివాదం వెనుక దశాబ్దాల చరిత్రతోపాటు.. రాజకీయ వైరుధ్యం, ప్రపంచ దేశాల ఆర్థిక ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. తైవాన్ ఏర్పాటు గురించి తెలుసుకోవాలంటే.. ముందుగా చైనా స్వాతంత్య్రం సాధించిన నాటి రోజులకు వెళ్లాలి. అప్పట్లో చైనాలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ), నేషనలిస్ట్ పార్టీ అని రెండు పార్టీలు ఉండేవి. కమ్యూనిస్టు పార్టీ అందరికి సమానత్వం కోసం, భూస్వాముల దగ్గర్నుంచి భూములు తీసుకొని పేదలకు పంచడం కోసం పోరాడగా.. నేషనలిస్ట్ పార్టీకి భూస్వాములు, నగరాల్లోని సంపన్నుల మద్దతు ఉండేది.


చైనాలో అంతర్యుర్ధం


రెండో ప్రపంచ యుద్ధం కాలంలో చైనాపై జపాన్ దురాక్రమణకు దిగింది. దీంతో కమ్యూనిస్టు పార్టీ, నేషనలిస్ట్ పార్టీలు తమ మధ్యనున్న సైద్ధాంతిక విబేధాలను పక్కనబెట్టి.. జపాన్‌ను అడ్డుకోవడానికి కలిసి పని చేశాయి. అయితే అది తాత్కాలికమే. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోగానే.. చైనాను ఎవరు పరిపాలించాలనే విషయమై మొదలైన గొడవ అంతర్యుద్ధానికి దారి తీసింది. అప్పట్లో చియాంగ్ కై షేక్ నాయకత్వంలోని నేషనలిస్ట్ పార్టీ (కుయోమింటాంగ్ - కేఎంటీ) ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో మావో నాయకత్వంలోని కమ్యూనిస్టులు.. క్రమశిక్షణ కలిగిన సైన్యం, రైతుల మద్దతుతో నగరాలను ముట్టడించారు.


రెండు చైనాలు ఏర్పాటు


1949 నాటికి కమ్యూనిస్టులు చైనా ప్రధాన భూభాగాన్ని దాదాపుగా ఆక్రమించారు. ఈ అంతర్యుద్ధంలో గెలిచిన కమ్యూనిస్టులు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఓడిన కేఎంటీ నాయకులు, వారి మద్దతుదారులు చైనా ప్రధాన భూభాగానికి సమీపంలో ఉన్న తైవాన్ ద్వీపానికి పారిపోయి.. రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీంతో రెండు చైనాలు ఏర్పడినట్లయ్యింది.


చియాంగ్ ప్రభుత్వం తైవాన్‌లో భూ సంస్కరణలు చేపట్టింది. అమెరికా సాయంతో.. పరిశ్రమలు ఏర్పాటు చేసి.. తైవాన్‌ను ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తుల్లో ఒకటిగా మార్చే దిశగా గట్టి పునాదులు వేసింది. కమ్యూనిస్టుల కారణంగా చైనా నుంచి పారిపోయి వచ్చిన చియాంగ్.. తైవాన్లో కమ్యూనిజం వ్యాప్తి చెందకుండా చూశారు. ఇందుకోసం 1987 వరకు అంటే 38 ఏళ్లపాటు తైవాన్‌లో మార్షల్ లా విధించారు. అయితే చైనా వేరు, తాము వేరు అన్నట్టుగా ఉండలేదు. చియాంగ్ కై-షేక్ మరణించే వరకూ.. తనే అసలైన చైనా పాలకుడిని అని.. ఏదో ఒక రోజు ప్రధాన భూభాగాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంటానని చెబుతూనే ఉండేవారు. చియాంగ్ మరణం తర్వాత తైవాన్ సైనిక పాలనను వదిలేసి.. ప్రజాస్వామ్యం వైపు మళ్లింది.


1971 వరకు ఐక్యరాజ్యసమితిలో తైవాన్‌ (రిపబ్లిక్ ఆఫ్ చైనా)కే ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఆ తర్వాత చైనా (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ప్రాబల్యం పెరగడంతో.. తైవాన్‌కు గుర్తింపు తగ్గిపోయింది. క్రమంగా చాలా దేశాలు అధికారికంగా చైనాను గుర్తిస్తూ.. తైవాన్‌తో అనధికారిక వాణిజ్య సంబంధాలు కొనసాగించడం మొదలుపెట్టాయి.


వన్ చైనా ప్రిన్సిపుల్ తెచ్చిన బీజింగ్


మరోవైపు చైనా (పీఆర్‌సీ) మాత్రం.. తైవాన్ ఎప్పటికీ తమ దేశంలో భాగమేనని గట్టిగా వాదిస్తోంది. 17వ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం చైనాను పరిపాలించింది. అప్పుడు తైవాన్ చైనాలో భాగంగా ఉండేదని డ్రాగన్ పాలకులు వాదిస్తున్నారు. తైవాన్‌ తమదే అని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం.. బీజింగ్ వన్ చైనా ప్రిన్సిపుల్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం తైవాన్ ప్రత్యేక దేశం కాదు, చైనాలో భాగం మాత్రమే. దీనికి అంగీకరించని దేశాలతో చైనా దౌత్య సంబంధాలను తెంచుకుంటుంది. తైవాన్‌కు ఆయుధాలను విక్రయించే దేశాలను చైనా శత్రువుగా చూడటం మొదలుపెట్టింది. బీజింగ్ వన్ చైనా ప్రిన్సిపుల్‌ నేపథ్యంలో.. అమెరికా వన్ చైనా పాలసీని తెర మీదకు తెచ్చింది. దీని ప్రకారం.. తైవాన్ చైనాలో భాగం అనే వాదనను అమెరికా గమనించింది. దీని అర్థం తైవాన్ చైనాలో భాగమని అమెరికా అధికారికంగా అంగీకరించడం కాదు. తైవాన్‌లో అమెరికాకు అధికారిక రాయబార కార్యాలయం లేదు. కానీ అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ తైవాన్ (AIT) పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయం దౌత్య పనులను చక్కబెడుతోంది. మరోవైపు భారత్ కూడా 1950ల నుంచే వన్ చైనా పాలసీని పాటిస్తోంది. అయితే సరిహద్దుల్లో అలజడుల నేపథ్యంలో ఇటీవల తన అధికారిక ప్రకటనల్లో వన్ చైనా అనే పదాన్ని వాడటం తగ్గించింది.


తైవాన్‌తో చైనాకు చిక్కులే..


తైవాన్ స్వతంత్ర దేశంగా అవతరించడం.. చైనాను చిక్కుల్లో పడేస్తుంది. తైవాన్ బాటలోనే.. టిబెట్ జిన్జియాంగ్ లాంటి ఇంత ప్రాంతాలు స్వతంత్రం కోసం గళం విప్పే అవకాశం ఉంది. అమెరికా లాంటి దేశాలు తైవాన్‌ను ఉపయోగించుకొని.. చైనాకు అత్యంత చేరువగా సైనిక విన్యాసాలు చేపట్టే అవకాశం ఉంది. ఇది భద్రత కోణంలో చైనాకు ఆందోళన కలిగించే అంశం. అదే సమయంలో తైవాన్ గనుక చైనాలో కలిసిపోతే.. ప్రపంచ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చు.


తైవాన్ చైనాలో విలీనమైతే..?


తైవాన్ చైనాలో విలీనమైతే.. ప్రజాస్వామ్య వ్యవస్థ కాస్తా.. కమ్యూనిస్టు నియంతృత్వం చేతుల్లోకి వెళ్తుంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు విఘాతం. అంతే కాదు పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధిపత్యం తగ్గిపోతుంది. చైనా పక్కనున్న అమెరికా మిత్రదేశాలైన జపాన్, సౌత్ కొరియాలకు వాషింగ్టన్‌పై నమ్మకం తగ్గిపోతుంది. అంతేకాదు.. తైవాన్ ఎఫెక్ట్ లేకపోతే, పసిఫిక్ మహాసముద్రంలో చైనా నౌకాదళం దూకుడుగా ముందుకెళ్లేందుకు వీలు కలుగుతుంది. ఇది అమెరికా నౌక స్థావరాలకు ముప్పుగా పరిణమిస్తుంది.


తైవాన్‌ను సెమీకండక్టర్ల తయారీ సూపర్ హబ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోని 90 శాతానికి పైగా అత్యాధునిక కంప్యూటర్ చిప్స్ తైవాన్‌లోనే తయారవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు మొదలు సూపర్ కంప్యూటర్ల వరకు అన్నీ తైవాన్‌పైనే ఆధారపడి ఉన్నాయి. తైవాన్ స్వతంత్రంగా ఉన్నంత కాలం.. ఈ సప్లయ్ చైన్‌కు ఇబ్బంది ఉండదు. ఒకవేళ తైవాన్‌ను చైనా ఆక్రమిస్తే.. సెమీకండక్టర్ల తయారీ చైనా గుప్పిట్లోకి వెళ్తుంది.


తైవాన్.. అమెరికాకు ఎందుకు ముఖ్యమంటే..?


చైనా దూకుడును అడ్డుకోవడానికి అమెరికాకు తైవాన్ ముఖ్యమైంది. అమెరికాకు తైవాన్ అనేది.. చైనాకు అత్యంత చేరువగా ఉండే మునగని ఓ యుద్ధ నౌక లాంటిది. తైవాన్ జలాల్లో అమెరికా యుద్ధ నౌకలను మోహరించి.. చైనాపై ఓ కన్నేసి ఉంచగలదు. తైవాన్ స్వతంత్రంగా ఉన్నంత కాలం.. చైనీస్ నేవీ స్వేచ్ఛగా పసిఫిక్ సముద్రంలోకి ప్రవేశించలేదు. తైవాన్‌ వ్యూహాత్మకమైన ప్రదేశంలో.. 'ఫస్ట్ ఐలాండ్ చైన్' మధ్యలో ఉంది. చైనా తన నౌకాదళాన్ని పసిఫిక్ మహాసముద్రంలోకి పంపించకుండా అడ్డుకోవడానికి తైవాన్ అడ్డుగోడలా ఉంటుంది.


ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే.. 1979లో చైనాతో దౌత్య సంబంధాలు ప్రారంభించిన అమెరికా.. తైవాన్‌తో పూర్తి స్థాయిలో సంబంధాలు వదిలేసుకోవడం ఇష్టం లేక.. తైవాన్ రిలేషన్స్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం.. తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను అమెరికా సరఫరా చేస్తుంది. ఒకవేళ తైవాన్‌ను చైనా బలవంతంగా ఆక్రమించాలని ప్రయత్నిస్తే.. అమెరికా దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. అయితే గత 20-30 ఏళ్లలో చైనా తన సైనిక శక్తిని విపరీతంగా పెంచుకుంది. పదే పదే యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తూ.. భయబ్రాంతులకు గురి చేస్తోంది. చైనాలో కమ్యూనిస్టు పాలన మొదలై 100 ఏళ్లు అయ్యే నాటికి.. అంటే 2049 నాటికి తైవాన్‌ను చైనాలో విలీనం చేసుకోవాలని జిన్‌పింగ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.


భారత్‌పై తైవాన్ ప్రభావం ఎంతంటే..?


భారత్‌ సెమీకండక్టర్ల కోసం తైవాన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. తైవాన్, చైనా మధ్య యుద్ధం వస్తే.. సెమీకండక్టర్ల కొరత కారణంగా.. ఫోన్లు, కార్లు, ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు మొదలైన వాటి ధరలు భారీగా పెరిగిపోతాయి. క్షిపణులు, యుద్ద విమానాలు, రాడార్లలో వాడే అత్యాధునిక చిప్‌లను సైతం భారత్ తైవాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఏ కారణం చేతనైనా తైవాన్ నుంచి సెమీకండక్టర్ల సరఫరా ఆగిపోతే.. ఆర్థిక వ్యవస్థపైనా, రక్షణ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతే కాదు తైవాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత చైనా.. భారత సరిహద్దుల వద్ద దూకుడుగా వ్యవహరించే ముప్పు కూడా ఉంది. ఇది భారత్‌పై ఒత్తిడిని పెంచుతుంది. తైవాన్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైన భారత్.. ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించింది. మన దేశంలోనే సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయడం కోసం ఫాక్స్‌‌కాన్ లాంటి తైవాన్ కంపెనీలతోపాటు ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది.


ప్రపంచాన్ని శాసించేదెవరో తేలేది తైవాన్ మనుగడ ఆధారంగానే...


ఒక్క మాటలో చెప్పాలంటే.. తైవాన్ అనేది కేవలం ఓ చిన్న ద్వీపదేశం మాత్రమే కాదు. అమెరికా, చైనాల్లో ప్రపంచాన్ని ఎవరు శాసిస్తారనేది కూడా తైవాన్ మనుగడపై ఆధారపడి ఉంది. ఎందుకంటే తైవాన్ స్వతంత్ర దేశంగా ఉన్నంత వరకు అమెరికా ఆధిపత్యం సాగుతుంది. ఒకవేళ చైనాలో విలీనమైతే.. డ్రాగన్ బలం మరింత పెరుగుతుంది. అది అమెరికా అగ్రరాజ్య హోదాకు గండి కొడుతుంది. అందుకే తైవాన్‌‌ను కవ్వించేలా చైనా సైనిక విన్యాసాలు చేపట్టినప్పుడల్లా అమెరికా కూడా గట్టిగా స్పందిస్తోంది. తైవాన్‌ను గనుక చైనా ఆక్రమిస్తే.. ఆసియా-పసిఫిక్‌లో సమతుల్యత దెబ్బతింటుంది. ఇది అమెరికా, భారత్‌లపై మాత్రమే కాకుండా.. జపాన్‌పైనా, చైనాతో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర దేశాలపైనా తీవ్రంగా ప్రభావం చూపుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa