'నా అన్వేషణ' పేరుతో యూట్యూబ్‌లో పాపులర్ అయిన అన్వేష్.. గతం కొద్ది కాలంగా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హిందూ దేవతలపై అసభ్యకర రీతిలో మాట్లాడాడని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అతన్ని ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడంతో.. యూట్యూబ్ ఛానెల్ కూడా బాయ్‌కాట్ చేయాని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ఇతడిపై ఏపీ, తెలంగాణలో ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అన్వేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్‌కు చెందిన హిందూ మహిళ లిదియా లక్ష్మి. అతడిని కన్వర్టెడ్ క్రిస్టియన్ గొర్రెగా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడు ఎప్పుడు, ఎక్కడ, ఏం చేస్తున్నాడో తనకు తెలుసని.. అన్వేష్ పతనం మొదలైందని మండిపడ్డారు.
"కేవలం భవద్గీత చదివినంత మాత్రాన నువ్వు సనాతని హిందువు అయిపోవు. ఎందుకంటే.. నువ్వు దేవతలను, గురువులను, రాముడి భార్య సీతమ్మను అవమానించావు. చాలా తప్పులు చేశావు. ప్రతిరోజు బూతులతో అసభ్యకరమైన భాష మాట్లాడుతున్నావు. ప్రతి సామాన్య పౌరుడిని తిడుతున్నావు, తక్కువ చేసి మాట్లాడుతున్నావు. సనాతన హిందుత్వాన్ని తిడుతూ.. సనాతన హిందువు కాలేవు. నువ్వు ఒక కొండ వెర్రి గొర్రె, కన్వెర్టెడ్ క్రిస్టియన్ గొర్రె. నీ గురించి ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. నీ బ్యాక్‌గ్రౌండ్ గురించి, నువ్వు విదేశాల్లో ఏం చేస్తున్నావో.. ప్రతి విషయం నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు థాయ్‌లాండ్‌లో ఉన్నావ్‌గా.. ఇక్కడ కూడా నువ్వు ఏం చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు. నిన్ను భారత్‌కు తీసుకురావడానికి ఒక పద్ధతి ఉంది. అలాగే ప్రభుత్వం తీసుకువస్తుంది. అది జరిగేలా మేము చేస్తాము. నీకు వ్యతిరేకంగా ధర్మం ఎలా.. తన ధర్మం నిర్వర్తిస్తుందో నువ్వు చూస్తావు. నోటికి వచ్చింది మాట్లాడుతూ.. భగవద్గీత చదివి నేను సనాతని అని చెప్పుకోకు.. అలా చేసినంత మాత్రాన అది నిన్ను, నీ బుర్రను పవిత్రం చేయలేదు. నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా.. అవేవీ నిన్ను రక్షించలేవు. చట్టం ప్రకారం నీకు శిక్ష తప్పదు. ఇప్పుటినుంచి నీ పతనం మొదలైంది. ఇదే నా ఫైనల్ వార్నింగ్"
ఎవరీ లిదియా లక్ష్మి?
లిదియా లక్ష్మి జురావ్ల్యోవ ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ ప్రాంతానికి చెందిన వారు. ప్రస్తుతం ఆమె థాయ్‌లాండ్ ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయంలో పని చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భారత్ వచ్చిన ఈమె.. హిందూ మతం పట్ల ఆకర్షితులయ్యారు. అనంతరం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ (ఐసీసీఆర్) స్కాలర్‌షిప్‌తో దాదాపు ఏడేళ్లు భారత్‌లో చదివారు. భారత సాంప్రదాయ కళలు, సంస్కృతి, సనాతన ధర్మం గురించి లోతుగా నేర్చుకున్నారు. ముఖ్యంగా భగవద్గీత తన జీవితంపై చాలా ప్రభావం చూపించిందని గతంలో లిదియా లక్ష్మి వెల్లడించారు. భగవద్గీత, అల్లూరి సీతారామరాజు ప్రేరణతో తాను ఉక్రెయిన్ ఆర్మీలో చేరినట్లు తెలిపారు. ఇక తాళ్లపాక అన్నమాచార్య, భక్త కన్నప్ప, భక్త ప్రహ్లాద, తరిగొండ వెంగమాంబ వంటి మహానుభావుల బోధనలు.. తనను భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లాలని చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధంలో గాయం తర్వాత.. లిదియా లక్ష్మి థాయ్‌లాండ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీలో డెస్క్ జాబ్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం స్థానిక యంత్రాంగాలతో కలిసి పురాతన శివ లింగాలు, ఆలయాలపై లిదియా లక్ష్మి పరిశోధనలు చేస్తున్నారు. పురాతన ఆలయాలకు పునర్వైభవం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పూజారులను పిలిపించి.. అక్కడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అంతేకాకుండా శ్రీ శారదా పీఠం, శ్రీంగేరి, కర్ణాటక పీఠాల పూజారులను కూడా పిలిపించి.. థాయ్‌లాండ్‌లో పూజలతో పాటు వినాయక చవితి, నవరాత్రి వేడుకలు జరిపించారు. ప్రస్తుతం లిదియా లక్ష్మి పురాతని శివలింగాలపై పరిశోధనలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa