ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోర్బ్స్ ఇండియా నివేదికపై స్పందించిన మంత్రి నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 02, 2026, 09:11 PM

ప్రతిష్ఠాత్మక బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్ ఇండియా' ప్రచురించిన ఓ కథనంపై ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కేవలం పోటీ పడటం లేదని, అందరినీ అధిగమించి ముందుకు దూసుకెళుతోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని 'ఫోర్బ్స్ ఇండియా' తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటంకిస్తూ ఓ కథనం వెలువరించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదిత పెట్టుబడులలో ఏకంగా 25.3% వాటాను కైవసం చేసుకుని అగ్రగామిగా నిలిచింది. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పెట్టుబడుల స్వీకరణలో ఒడిశా (13.1%), మహారాష్ట్ర (12.8%) వంటి పారిశ్రామిక రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఏపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. భారతదేశ పారిశ్రామిక, పెట్టుబడుల గమనంలో కీలక మార్పు చోటుచేసుకుంటోందని, వృద్ధి ఇప్పుడు తూర్పు, దక్షిణ రాష్ట్రాల వైపు మళ్లుతోందని ఈ నివేదిక సూచిస్తోంది.నివేదిక ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ప్రతిపాదనకు వచ్చాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 11.5% అధికం. ఇందులో సింహభాగం, అంటే 51.2% పెట్టుబడులు కేవలం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ మూడింటిలోనూ ఏపీ తిరుగులేని ఆధిపత్యంతో మొదటి స్థానంలో నిలవడం విశేషం.ఈ అద్భుతమైన విజయంపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇతరులను అందుకోవడం లేదు, వారిని దాటి ముందుకు దూసుకుపోతోంది. స్థిరమైన సంస్కరణలు, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం, పెట్టుబడిదారులకు స్పష్టమైన భరోసా ఇవ్వడం వల్లే ఈ అసాధారణ ఫలితం సాధ్యమైంది. పారదర్శకమైన విధానాలతో కూడిన వాతావరణాన్ని సృష్టించడం, పరిశ్రమలకు పెద్దపీట వేయడం, చెప్పిన హామీలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంపైనే మా ప్రభుత్వం దృష్టి సారించింది అని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల స్నేహపూర్వక పాలన, అనుమతులలో వేగం, రంగాల వారీగా ప్రత్యేక విధానాలు, మౌలిక సదుపాయాలపై భారీగా దృష్టి పెట్టడమే ఈ విజయానికి కారణమని ప్రభుత్వం విశ్లేషిస్తోంది. ముఖ్యంగా ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, ఇంధన, డిజిటల్ రంగాలలో మౌలిక వసతులను బలోపేతం చేయడం కలిసొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో ప్రభుత్వం నిరంతరం జరుపుతున్న చర్చలు, స్థిరమైన విధానాలు, వేగవంతమైన పాలన కారణంగా తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాల రంగాలలో భారీ పెట్టుబడులు తరలివస్తున్నాయి.వచ్చే ప్రతి పెట్టుబడి క్షేత్రస్థాయిలో ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, మన ప్రజలకు ఆర్థిక అవకాశాలుగా మారాలి. పెట్టుబడిదారులతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించడం, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తాం అని నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ ప్రదర్శనతో, భారతదేశ తదుపరి పారిశ్రామిక వృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఒక కీలక చోదకశక్తిగా, పోటీతత్వ పాలనకు ఒక ప్రమాణికంగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa