ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేనే రాజు నేనే మంత్రి మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 02:05 PM

నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, అజయ్‌, నవదీప్‌, జోష్‌ రవి, తనికెళ్లభరణి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
సమర్పణ: డి.రామానాయుడు
నిర్మాణ సంస్థలు: సురేష్‌ ప్రొడక్షన్స్‌, బ్లూ పానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
రేటింగ్‌: 2.75/5

విలక్షణమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు రానా దగ్గుబాటి. అప్పుడెప్పుడో చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో హిట్స్‌ అందుకున్న దర్శకుడు తేజ. తర్వాత తేజకు అనుకున్న స్థాయిలో విజయాలు లేవు. తేజ దర్శకత్వంలో రానా నటించిన చిత్రమే 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ సినిమాలోని పొలిటికల్‌ డైలాగ్స్‌, రానా నటన సినిమాపై మంచి అంచనాలే పెంచాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? లేదా? అని తెలియాలంటే కథలోకి ఓ లుక్కేదాం..

కథ:
జోగేంద్ర(రానా), రాధ(కాజల్‌) భార్యభర్తలు. ఒకరంటే ఒకరికి ప్రాణం. జోగేంద్ర కారైకూడా గ్రామంలో ధర్మ వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. పెళ్లైయిన మూడేళ్లకు రాధ గర్భవతి అవుతుంది. మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్లిన రాధను ఊరి సర్పంచ్‌(ప్రదీప్‌ రావత్‌) భార్య గుడి మెట్లపై నుండి తోసేస్తుంది. దాంతో రాధ గర్భం పోతుంది. రాధకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేస్తారు. రాధకు సర్పంచ్‌ అంటే కోపం వస్తుంది. ఎలాగైనా జోగేంద్రను సర్పంచ్‌ కావాలని కోరిక కోరుతుంది. భార్య అంటే ఇష్టముండే జోగేంద్ర తన తెలివి తేటలతో సర్పంచ్‌ అవుతాడు. తన పదవి పోవడంతో మాజీ సర్పంచ్‌, జోగిని హత్య చేయాలని చూస్తే, జోగియే మాజీ సర్పంచ్‌ను చంపేస్తాడు. జోగేంద్ర పదవి, డబ్బు, ప్రజల్లో అతనికున్న పలుకుబడిని చూసి ఎమ్మెల్యే చౌడప్ప(సత్య ప్రకాష్‌) అతన్ని పోలీసు కేసు నుండి తప్పిస్తాడు. ఈ కేసులో ఎమ్మెల్యేకు సి.ఐ(అజయ్‌) సహాయపడతాడు. చివరకు అజయ్‌, ఎమ్మెల్యేలు జోగిని డబ్బులు అడుగుతారు. జోగి తన తెలివితో సిఐని ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాడు. ఎమ్మెల్యేను చంపేసి ఎమ్మెల్యే అవుతాడు. అక్కడ నుండి జోగేంద్ర రాజకీయ చదరంగం ఆడటం మొదలు పెడతాడు. జోగేంద్రకు శివ(నవదీప్‌) కుడిభుజంలా అండగా నిలబడతాడు. రాజకీయ ప్రత్యర్థులు ఆడే ఆటలో నిజానిజాలు తెలియకుండా శివను జోగేంద్ర చంపేస్తాడు. ఎలాగైనా సీఎం కావాలని జోగేంద్ర కలలు కంటాడు. అందుకోసం అతను కుర్చీలాటను మొదలు పెడతాడు. చివరకు ఆ ఆటలో ఎవరు విజేతగా నిలుస్తారు? జోగేంద్ర చివరికి ఏం సాధిస్తాడు? ఏం పొగొట్టుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
నటీనటులు విషయానికి వస్తే సినిమా అంతా ప్రధానంగా జోగేంద్ర, రాధ పాత్రలపైనే సాగుతుంది. జోగేంద్రగా రానా, రాధగా కాజల్‌ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బాహుబలి, ఘాజీ వంటి డిఫరెంట్‌ మూవీస్‌ చేసిన రానా లీడర్‌ తర్వాత చేసిన పొలిటికల్‌ జోనర్‌ మూవీ ఇది. సామాన్య వడ్డీ వ్యాపారి సీఎం కావాలనుకున్నప్పుడు అతను ఎదిగే క్రమం, అందులో అతను ఎదుర్కొనే సమస్యలు అన్నింటినీ చక్కగా చూపించారు. రానా తన పాత్రకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని చేసిన సినిమా ఇది. రానా లుక్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక కాజల్‌ కూడా హోమ్లి పాత్రలో చక్కగా ఒదిగింది. ప్రీ క్లైమాక్స్‌లో హాస్పిటల్‌ సీన్‌లో కాజల్‌ నటన మెప్పిస్తుంది. ఇక నవదీప్‌ కీలక పాత్రలో తన పాత్రకు న్యాయం చేశాడు. ఫస్టాఫ్‌ వరకే నవదీప్‌ పాత్ర పరిమితమైంది. విలన్‌ పాత్రలో అశుతోష్‌ రానా మెప్పించాడు. ఇక పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో సెటైరికల్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. వాడు జోగేంద్ర..అంటూ డైలాగ్‌ చెబుతూ మరోవైపు ప్రభాస్‌ శ్రీను నవ్వించాడు. దూరదర్శన్‌ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో, మరోవైపు సెంట్రల్‌ జైలు సూపరిడెంట్‌ పాత్రలో జయప్రకాష్‌ రెడ్డిలు అలరించారు ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు తేజ ఇప్పటి వరకు లవ్‌స్టోరీతోనే పెద్ద విజయాలను సాధించాడు. ఈసారి తన ట్రెండ్‌కు భిన్నంగా చేసిన సినిమా ఇది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఐదేళ్ల కాలంలో ఓ వ్యక్తి ప్రయాణాన్ని తేజ తెరకెక్కించే ప్రయత్నమే ఈ చిత్రం. స్క్రీన్‌ప్లే పరంగా క్లారిటీతో సినిమా సాగుతుంది. అనూప్‌ నువ్వే నువ్వే సాంగ్‌, జోగేంద్ర టైటిల్‌ సాంగ్‌ ఇలా అన్ని మాంటేజ్‌ సాంగ్స్‌ ఒకే అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప‌రావాలేదు. వెంకట్‌ సి.దిలీప్‌ సినిమాటోగ్రఫీ బావుంది. లక్ష్మీభూపాల్‌ మాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. రానా సందర్భానుసారం చెప్పే సామెతలు. పదవుల్లో ఉన్నవాళ్లే బాగుంటారు. పక్కనుండేవాళ్లు బాగుండరు. అన్న వస్త్రాలు కావాలంటే ఉన్న వస్త్రాలు పోతాయి, వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హోటల్‌లో పెడితే నేను అవుతాను సీఎం...శత్రువు కూడా పాఠాలు నేర్పుతాడని తెలిసింది..ఇలాంటి డైలాగ్స్‌తో పాటు క్ల్రైమాక్స్‌లో జనం ఎవరికి ఓటేస్తుంటారు. ఎలా మోసపోతుంటారు. ప్రజల గురించి చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు. అసలు సానుభూతి ఓట్లు వేయడం, వారసత్వ రాజకీయాలు మీద ఇలా అన్నింటిపై వచ్చే డైలాగ్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి.


 


బోటమ్‌ లైన్‌: రాధ కోసమే జోగేంద్ర కుర్చీలాట






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa