ఫిదా సినిమాలో భానుమతిగా ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్లలో టాలెంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పల్లవి అంటే యూత్ లో క్రేజ్ మాములుగా లేదు. ఆమె నాచురల్ నటనకు, ముఖ్యంగా మెరుపుతీగలా యమా స్పీడ్ గా చేసే డాన్స్ మూవ్మెంట్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. లేడీ పవర్ స్టార్ గా స్టార్ స్టేటస్ అందుకున్న పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెకు తాను వీరాభిమానిని అంటూ ఒక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తెలిపారు.
దగ్గుబాటి రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం జూన్ 7న విడుదలకాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం సాయంత్రం ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ ను రానా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చెయ్యగా, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా చూడాలని కుతూహలంగా ఉంది. రానా...నువ్వు సూపర్ గా చేసావ్... ఇక సాయిపల్లవికి నేను వీరాభిమానిని..అని కరణ్ రీట్వీట్ చేసాడు. కరణ్ ట్వీట్ కు సాయిపల్లవి స్పందించింది. మీరు దయగలవారు .. నాకు గర్వంగా ఉంది... మీకు కృతజ్ఞతలు... అని ట్వీట్ లో పేర్కొంది.
సాయిపల్లవి అంటే తనకిష్టమని కరణ్ చెప్పడం ఇదే మొదటిసారి కాదు. 2017లో పల్లవి మొదటి సినిమా ఫిదా విడుదలైనప్పుడే కరణ్ సాయిపల్లవి నటనను తెగ మెచ్చుకున్నాడు.