లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి చేసుకుని ఒక రోజు కూడా కాకముందే ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. నయన్ - విఘ్నేష్ దంపతులు తిరుపతి మాడ వీధుల్లో చెప్పులేసుకుని తిరిగారని, అలానే ఫోటోలు కూడా దిగారని, ఇలాంటివి తిరుమల తిరుపతి దేవస్థాన విధివిధానాలకు విరుద్ధమని పేర్కొంటూ టీటీడీ నవ దంపతులపకు నోటీసులు జారీ చేసింది. నయన్- విఘ్నేష్ తీరు పట్ల శ్రీవారి భక్తులు అగ్గిలం మీద గుగ్గిలమవుతున్నారు. జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నయనతార వివాహం ఎట్టకేలకు జరిగిందిలే అనుకుంటే, వెంటనే ఈ వివాదాల గోలేంటి? అని నయన్ అభిమానులు ఘొల్లుమంటున్నారు. తమపై వచ్చిన ఈ ఫిర్యాదును పొరపాటుగా జరిగిందని సంజాయిషీ ఇస్తూ నయన్ భర్త విఘ్నేష్ శివన్ అధికారికంగా ఒక క్షమాపణ లేఖను రాసారు. నిజానికి తమ పెళ్లి తిరుమల లో జరగాల్సింది, కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ వల్ల చేసుకోలేకపోయామని లేఖలో పేర్కొన్నారు. తిరుమలలోనే తమ పెళ్లి జరిగిందనుకునేలా, చెన్నైలో పెళ్ళయిన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా తిరుమల శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చామని చెప్పారు. జనాలు కిటకిటలాడుతుండటంతో త్వరగా దర్శనం పుర్తి చేసుకుని, తెలియకుండా చెప్పులతో మాడ వీధుల్లోకి వచ్చేశామని చెప్పారు. ఇలా చెయ్యడం తప్పే కానీ పొరపాటున జరిగింది క్షమించండి, తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారంటే తమకెంతో భక్తి అని చెప్పారు. తరచూ ఆలయాలకు వెళ్తూ ఉండే తమకు దేవుడంటే ఎంతో భయభక్తులని, ఇక్కడే పెళ్లి చేసుకుందామని గత 30 రోజులలో 5 సార్లు తిరుమలకు రావడం జరిగిందని విఘ్నేష్ లెటర్ లో పేర్కొన్నారు.