టాలీవుడ్‌లో మల్టీస్టారర్ల చిత్రాలు వస్తే సందడి భారీగానే కనిపిస్తుంది. వెండి తెర మీద ఇద్దరు అగ్ర హీరోలు కనిపిస్తే ప్రేక్షకులు, అభిమానులు పులకించిపోతారు. ఇలాంటి పరిస్థితిలో తాజాగా వస్తున్న మల్టీస్టారర్ దేవదాస్. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని, నేచురల్ స్టార్ నాని దేవదాస్‌గా మారారు. వారి సరసన గీతా గోవిందం ఫేమ్ రష్మిక మందన్న, ఆక్షాంక్ష సింగ్‌లు మెరిసారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మల్టీస్టారర్ చిత్రం ఎలా ఉంది. నాగార్జున, నాని ఏ మేరకు మెప్పించారని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
దేవా (మాఫియా డాన్) ఎవరూ లేని అనాధ. తన ఎవరో అనే విషయం ప్రపంచానికి తెలియకుండా మరో మాఫియా డాన్, పెంపుడు తండ్రి (శరత్ కుమార్) నీడలో పెరిగి పెద్దవుతాడు. మాఫియా అంతర్గత కలహాల కారణంగా సేఠ్ (కునాల్ కపూర్) చేతిలో పెంపుడు తండ్రి హత్యకు గురవుతాడు. వారిపై పగ తీర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చిన దేవా ఎన్‌కౌంటర్‌లో గాయపడి దాసు ( నాని) వద్దకు చేరుతాడు. అప్పటికే డాక్టర్‌గా రాణించడానికి కష్టాలు పడుతూ క్లినిక్ పెట్టుకొంటున్న దాసుకు దేవా రాకతో కష్టాలు మొదలైతాయి. దేవాతో పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది ఈ మూల కథ.
ఇక దేవా జీవితంలోకి న్యూస్ రీడర్ (జాహ్నవి) ఎలా ప్రవేశించింది. దేవాకు జాహ్నవి ఎందుకు బ్రేకప్ చెప్పింది. దాసుతో పూజా (రష్మిక మందన్న) ప్రేమ వ్యవహారం ఎలా మొదలైంది. దాసును పూజ ఎందుకు వెంటాడుతుంది. మాఫియా జీవితానికి దేవా ముగింపు పలికాడా? కార్పోరేట్ హాస్పిటల్‌లో అవమానాలకు గురైన దాసు మళ్లీ వారి ప్రేమను ఎలా పొందాడు? అనే ప్రశ్నలకు సమాధానం కోసం దేవదాసు సినిమా చూడాల్సిందే.
దేవా చిన్నప్పటి కథతో ప్రారంభమై శరత్ కుమార్, నాగార్జున బంధం ఎలా బలపడిందో అనే అంశం నుంచి అత్యవసర పరిస్థితుల్లో దాసును దేవా కలవడమనే పాయింట్ ప్రథమార్థంలో సాగుతుంది. తొలిభాగంగా వినోదానికే పెద్ద పీట వేశారు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని నవ్విస్తాయి. కాకపోతే కథనం మరీ నిదానంగా ఉండటం, నెక్ట్స్ సీన్ ఏంటో ముందే ఊహించడం లాంటి అంశాలు కొంత అసంతృప్తిని గురిచేస్తాయి. కథలో బలం లేకపోవడం పెద్దగా ట్విస్టులేమీ లేకుండా ఇంటర్వెల్ పడుతుంది
ఇక రెండో భాగానికి వచ్చేసరికి కథంతా రొటీన్‌గా, గందరగోళంగా మారుతుంది. పలు విషయాలను సెకండాఫ్‌లోనే చెప్పాల్సి రావడం, ఇద్దరు స్టార్లను బ్యాలెన్స్ చేసే ప్రక్రియలో కథనానికి కళ్లెం వేస్తుంది. కథ, క్యారెక్టర్లలో ఎమోషన్ ఉన్నప్పటికీ, దానిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తుంది. రష్మిక, ఆకాంక్ష పాత్రలు స్క్రీన్ మీద కనపడుతున్నా వాటిలో బలం కనిపించదు. దేవ, దాసు క్యారెక్టర్లు కనిపించకపోగా.. ఆ పాత్రల్లో హీరోలే కనిపిస్తారు. కాకపోతే ప్రీ క్లైమాక్స్‌లో పిల్లాడి ఎపిసోడ్ గుండెను తడిమేస్తుంది. చివర్లో ఎప్పటిలానే పిస్టల్స్ కాల్పులు, రొటీన్ ఫైట్లతో హడావిడిగా కథను ముగించే ప్రయత్నం జరిగిందనే భావన కలుగుతుంది.
నాగార్జున యాక్టింగ్...నాని నటన
డాన్ క్యారెక్టర్లతో మెప్పించిన నాగార్జున దేవా పాత్రలో ఒదిగిపోయాడు. తెర మీద గ్లామర్‌గా కనిపించాడు. ప్రేమికుడు, స్నేహితుడు, డాన్ పాత్రలకు తగినట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకొన్నాడు. పిల్లాడి సీన్‌లో నాగ్ ఎమోషన్స్ ఆకట్టుకొన్నాయి. తన పాత్ర చుట్టు కథ, కథనాలు బలంగా లేకపోవడంతో దేవా క్యారెక్టర్ అక్కడక్కడా తేలిపోయినట్టు కనిపిస్తుంది.విలక్షమైన పాత్రలకు పెట్టింది పేరు నాని. మరోసారి పక్కింటి అబ్బాయి పాత్రలో ఆకట్టుకొన్నాడు. ఎంత పక్కింటి అబ్బాయి పాత్రైన కాస్ట్యూమ్ పరంగా డల్‌గా కనిపించాడు. డాక్టర్ పాత్రలో అవసరమైన చోట ఎమోషన్ పలికించాడు. ఇలాంటి పాత్రలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని నాని మరోసారి నిరూపించాడు. కథ, కథనాలకు అనుగుణంగా దాసు క్యారెక్టర్‌తో ముందుకు సాగిపోయాడు.
ఫైనల్‌గా హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ పాయింట్‌తో వినోదాత్మకంగా రూపొందిన చిత్రం దేవదాస్. నాగార్జున, నాని కాంబినేషన్ ఈ సినిమాకు హైలెట్. రష్మిక, ఆకాంక్ష గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తే సినిమా భారీ విజయాన్ని అందుకొనే అవకాశాలు ఉన్నాయి.
మూవీ రివ్యూ : 3/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa