నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నటీనటులు: ఎన్టీఆర్, పూజా హెగ్డే, జగపతిబాబు, ఈషా రెబ్బా, నాగబాబు, సునీల్, రావు రమేశ్, సుప్రియా పాథక్ తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్
నిర్మాతలు: ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
కథ: వీరరాఘవరెడ్డి అలియాస్ వీర అలియాస్ రాఘవ (ఎన్టీఆర్) కొమ్మద్దికి చెందిన నారపరెడ్డి (నాగబాబు) కుమారుడు. పక్క ఊరు నల్లగుడిలో బసిరెడ్డి (జగపతిబాబు) ఉంటాడు. అతని కుమారుడు బాలరెడ్డి (నవీన్ చంద్ర). ఒకానొక సమయంలో బసిరెడ్డి పేక ముక్కలు ఆడుతూ ఐదు రూపాయలు బాకీ పడతాడు. అది అడిగిన వ్యక్తి తల నరుకుతాడు. దాంతో రెండు ఊర్ల మధ్య ఫ్యాక్షన్ మొదలవుతుంది. అమెరికాలో చదువుకున్న రాఘవ కొమ్మద్దికి వచ్చీరాగానే అదే అదునుగా భావించిన బసిరెడ్డి వారి మీద అటాక్ చేయిస్తాడు. ఆ అటాక్‌లో నారపరెడ్డి ప్రాణాలు కోల్పోతాడు. అయితే, నారపరెడ్డి తల్లి చెప్పిన మాటలు విని రాఘవలో మార్పు వస్తుంది. సిటీకెళ్తాడు. అక్కడ అతనికి నీలాంబరి (సునీల్) పరిచయమవుతాడు. అతని గ్యారేజ్‌లో ఉన్నప్పుడే అతనికి అరవింద (పూజా హెగ్డే) పరిచయమవుతుంది. ఆమె ఆంత్రోపాలజీ స్టూడెంట్. ఫ్యాక్షన్ గురించి స్పెషల్‌గా చదువుతూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పే మాటలకు రాఘవ కనెక్ట్ అవుతాడు. ఓ సందర్భంలో బాలరెడ్డిని పిలిచి మాట్లాడుతాడు. అందుకు రాజకీయ ప్రముఖులు శుభలేఖ సుధాకర్, రావు రమేశ్ కూడా మద్దతు పలుకుతారు. ఆ మీటింగ్ తర్వాత ఏమైంది? బాలరెడ్డిని ఎవరు చంపారు? తన ఊరు పచ్చగా ఉండాలని రాఘవ కన్న కల నెరవేరిందా? లేదా? అనేది ఆసక్తికరం.
కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి? అన్న కాన్సెప్ట్‌లో ఫ్యాక్షనిజాన్ని మరో కోణంలో చూపిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ‘వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అలాంటి గొప్పోడు రక్తపుటేరులు పారించే ఫ్యాక్షనిజం ఉన్న కుటుంబం నుండి రావడం.. హింసకు, రక్తపాతానికి దూరంగా ఆ ఊరిని కాపాడటం.. అనే పాయింట్‌తో మాటల మాంత్రికుడు తన శైలికి భిన్నంగా తెరకెక్కించిన కథే ‘అరవింద సమేత వీర రాఘవ’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌తో తొలి చిత్రం ఇదే కావడంతో పాటు.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా తెరక్కించారు. ఆయన శైలికి భిన్నంగా ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ క్లాస్ ఎలిమెంట్స్‌తో రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘అరవింద సమేత’ చిత్రాన్ని రూపొందించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
‘అరవింద సమేత వీర రాఘవ’ ఇది అయిదు రూపాయిల కథ. అవును కేవలం ఐదురూపాయల కోసం రెండు ఊర్లలో రక్తపుటేరులు పారతాయి. రాయలసీమలో నల్లగుడి, కొమ్మద్ది ఊళ్ల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథే ఈ సినిమా. బసిరెడ్డి (జగపతిబాబు) నల్లగుడి ప్రాతినిధ్యం వహిస్తాడు. కొమ్మద్ది ఊరికి నారపరెడ్డి (నాగబాబు) పెద్దగా ఉంటారు. పేకాటలో వచ్చిన చిన్న గొడవ కారణంగా ఈ రెండు ఊర్ల మధ్య గొడవ మొదలౌతోంది. ఈ గొడవలో బసిరెడ్డి.. నారపరెడ్డి తండ్రిని చంపేస్తాడు. ప్రతిగా నారపరెడ్డి బసిరెడ్డి తండ్రిని చంపుతాడు. ఇలా ఈ రెండు ఊర్ల మధ్య 30 ఏళ్ల పాటు వైరం నడుస్తూనే ఉంటుంది.
నారపరెడ్డి కుటుంబాన్ని అంత చేయాలని బసిరెడ్డి రగిలిపోతుంటాడు. 12 ఏళ్ల తరువాత లండన్ నుండి వస్తున్న వీర రాఘవను (ఎన్టీఆర్) చంపడానికి ప్లాన్ చేస్తారు. ఈ అటాక్‌లో నారపరెడ్డి చనిపోతారు. తండ్రి మరణంతో శత్రువులపై తెగపడతాడు వీర రాఘవ. బసిరెడ్డి గొంతులో కత్తి దించి శత్రువుల్ని ఊచకోత కోస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కత్తిపట్టిన వీర రాఘవ తన చుట్టూ జరుగుతున్న పరిణామాలతో పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే చోట.. ప్రశాంతను చూడాలనుకుంటాడు. కత్తి పట్టకుండానే సీమ నుండి ఫ్యాక్షనిజాన్ని తరిమికొట్టాలన్న వీర రాఘవ కల ఎలా నెరవేరిందన్నదే మిగతా కథ.
రెండు ఊళ్ల మధ్య గొడవ.. హీరో తన తండ్రిని కోల్పోవడం.. శత్రువులపై కక్ష సాధించడం ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వచ్చాయి అయితే ఇలాంటి కథలకు సరైన సొల్యుషన్ వెతికి పట్టాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తన కలంతో మాటల తూటాలు పేల్చడంలో దిట్ట త్రివిక్రమ్. ఇలాంటి దర్శకుడికి ఆ మాటల్ని బాణంలా సంధించగలిగే హీరో దొరికితే.. థియేటర్స్‌లో ప్రేక్షకులకు పండగే కదా.. అలాంటి మ్యాజిక్‌నే ‘అరవింద సమేత’ చిత్రంలో చూపించారు.
ఫ్యాక్షనిజం అంటే కత్తి పట్టడం.. పగ ప్రతీకారమే కాదు. తండ్రిని కోల్పోయిన ఓ కొడుకు పడే బాధ, భర్త కోసం ఎదురు చూసే ఓ భార్య వేదన, కొడుకు కోసం తాపత్రయ పడే ఓ తల్లి ఆవేదనను ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో కళ్లకు కట్టి చూపించారు దర్శకుడు.
ఎన్టీఆర్ ఉగ్రరూపం..
‘రం.. రుధిరం.. సమరం.. శిశిరం, రం.. మరణం.. గెలవమ్.. ఎవరం’ అంటూ తొలి ఫైట్‌లోనే మచ్చల పులి గాండ్రిస్తే ఎలా ఉంటాదో రుచి చూపాడు ఎన్టీఆర్. ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా..? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా..? ఇదిగో అరవింద సమేతలో ఎన్టీఆర్ మాదిరే ఉంటాది. తొలి ఇరవై నిమిషాల్లో ఎన్టీఆర్ ఉగ్రరూపం చూపించారు. సిక్స్ ప్యాక్‌లో కత్తి పట్టి శత్రువుల్ని ఊచకోత కోస్తుంటే.. ఇది త్రివిక్రమ్ సినిమానా లేక బోయపాటి సినిమా అనే సందేహాలు కలగక మానవు. ముఖ్యంగా తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని చేసిన తొలి ఫైట్ సినిమాకే హైలైట్. భావోద్వేగ సన్నివేశాల్లో జీవించేశారు ఎన్టీఆర్. ఆయన రాయలసీమ యాసకు త్రివిక్రమ్ మాటల తూటాలు తోడు కావడంతో థియేటర్‌లో చప్పట్ల మోత మోగింది.
‘అరవింద’ కథకు కీలకం: ఫ్యాక్షనిజం నుండి ఊరిని కాపాడాలనుకునే వీర రాఘవకి హైదరాబాద్‌లో ఇదే సబ్జెక్ట్‌పై రీసెర్చ్ చేసే అరవింద (పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. ‘వినే టైమ్.. చెప్పే మనిషి వల్ల విషయం విలువ మారిపోతుంది’ అని నమ్మిన వీర రాఘవ సమస్యకు అరవింద క్యాజువల్‌గాా చెప్పే విషయాలే పరిష్కారం చూపుతాయి. అరవింద పాత్రలో పూజా హెగ్డే పరిణితి చెందిన నటనతో ఆకట్టుకుంది. అందం, అభినయంతో హావభావాలను బాగా పలికించింది. ఎక్స్‌పోజింగ్ జోలికి పోకుండా తన పరిధిమేర చక్కని నటనతో మెప్పించింది పూజా. ఇక మరో హీరోయిన్ ఇషా రెబ్బా.. పూజాకి చెల్లెలి పాత్రలో న్యాయం చేసింది.
వారెవ్వా.. బసిరెడ్డి: ఈ సినిమా చూశాక జగపతిబాబు లేకపోతే ‘అరవింద సమేత వీర రాఘవ’ లేదు అని ప్రి రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఎందుకు అన్నారో ఈ సినిమా చూశాక అర్ధమైపోతుంది. పగ, ప్రతీకారం కోసం కన్న కొడుకుని కూడా చంపడానికి వెనుకాడని క్రూరమైన ఫ్యాక్షనిస్ట్ పాత్రలో జగపతిబాబు జీవించేశారు. మెడలో కత్తి దిగినా.. రక్తం కారుతున్నా.. తన పగను నరనరాల్లో జీర్ణించుకునే పాత్ర కోసం ప్రాణం పెట్టారాయన.
ఈ మూవీతో హీరో నుండి సహాయ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ సునీల్.. నీలాంబరిగా, వీర రాఘవకు స్నేహితుడిగా మంచి మార్కులే సంపాదించాడు. కామెడీకి దూరంగా కథలో భాగమయ్యారు సునీల్. బసిరెడ్డి కొడుకుగా బాలిరెడ్డి పాత్రలో అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర ఆకట్టుకున్నారు. నరేష్, రావు రమేష్, శుభలేక సుధాకర్, సితార, దేవయాని, బ్రహ్మాజీ, జబర్దస్త్ చంద్ర ఇలా ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంది.
ప్లస్ పాయింట్స్
- ఎన్టీఆర్ నటన
- త్రివిక్రమ్ డైలాగులు
- జేజి చేతిలో కుంకుమ పట్టుకునే సీన్.. ఆ తరహా సన్నివేశాలు
- రాయలసీమ యాస
రివ్యూ : 3/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa