ఇప్పుడున్న ట్రెండ్‌లో ఏది చెప్పినా కాస్త డిఫరెంట్‌గా చెబితేనే వినేవారికైనా, చూసేవారికైనా బుర్రలకు ఎక్కుతుంది. మాట రూపంలో కాకుండా పాట రూపంలో చెబితే అది ఇంకా తొందరగా అందరికీ చేరుతుంది. ఆ ఆలోచనలోంచి ఓ మంచి సామాజిక అంశాన్ని తీసుకుని వైద్యుడు, దర్శకుడు ఆనంద్ కుమార్ ఓ మ్యూజిక్ వీడియో తీశారు. దాని పేరు ‘రెయిన్ బో ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్లా ఏడు భాషల్లో ఈ మ్యూజిక్ ఆల్బమ్‌ను త్వరలో సంగీత ప్రియుల ముందుకు తీసుకురానున్నారు దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో రూపొందించారు. యాంటీ రేసిజం(జాత్యంహకార వ్యతిరేకత) అనే నినాదంతో ఈ ఆల్బం రాబోతోంది. పాటంటే పాడాం, ఆ రిథమ్‌కు ఎంజాయ్ చేశాం అనకుండా ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. శ్రావ్యంగా సాగే సంగీతానికి తోడు, సమాజాన్ని ప్రేమిద్దాం, ప్రేమను పంచుదాం అంటూ సాగే వినసొంపైన సాహిత్యంతో పాట ఆసాంతం అలరిస్తుంది. అన్నీ కుదిరితే త్వరలోనే కేటీఆర్ చేతుల మీదుగా ఆల్బంను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యూ ఇయర్ రోజున(జనవరి 1)న లిరికల్ వీడియో విడుదల చేస్తున్నారు. యువతను ఆకర్షించేలా మాంచి ఊపున్న మ్యూజిక్ ఆల్బం తీస్తే యూట్యూబ్ మార్కెట్లో సూపర్ హిట్ అవుతుంది కదా అని దర్శకుడిని అడిగితే.. యువత ఇలాంటివి కూడా ఇష్టపడతారని చెప్పారు. కళ్ల ముందు జరుగుతున్నదాన్ని విశ్లేషించి చెబితే బాగుంటుందన్నారు. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్న యువతకు అక్కడ జాతి వివక్ష ఏర్పడుతోంది. దీంతో అన్యాయంగా కాల్పులకు గురై తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ కోవలో ఈమధ్యే క్యాన్సర్స్ సిటీలో శరత్ కొప్పు, శ్రీనివాస్ కూచిభొట్ల అనే ఇద్దరు యువకులు కాల్పులకు అన్యాయంగా బలైన విషయం తెలిసిందే. కేవలం జాతి వివక్ష కారణంగా వారిద్దరి విలువైన ప్రాణాలు తూటాలకు బలయ్యాయి.
చెట్టంత ఎదిగిన కొడుకులు అర్థాంతరంగా చనిపోతే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటుంది. వాళ్ళను ఓదార్చటం ఎవరితరమూ కాదు. ఈ క్రమంలో శ్రీనివాస్ కూచిభొట్ల సతీమణి సునయన రాసిన ఉత్తరం ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. ఆ ఉత్తరంలో వారి ప్రేమానురాగాలు, భవిష్యత్తు గురించి వారు వేసుకున్న ప్రణాళికల గురించి వివరించారు. అప్పుడే దర్శకుడు ఆనంద్ కుమార్ చలించిపోయారు. ఈ జాత్యాంహకారాన్ని రూపుమాపడానికి తనవంతుగా ఏదైనా చెయ్యాలని ఈ ఆల్బానికి పూనుకున్నానని వివరించారు. జాతి వివక్ష, కుల వివక్షల నిర్మూలనలో తనవంతు పాత్ర ఈ పాట అన్నారు. సాటి మనిషి మీద విషం చిమ్మడం, కక్ష్య, పగలతో రగిలిపోయి ఒకరి జీవితాన్ని అన్యాయంగా అంతం చేసే హక్కు ఎవరికీ లేదని చెప్పే ప్రయత్నం చేశామని అన్నారు. ఈ కాన్సెప్ట్ చెప్పగానే స్వాతి పెనుగొండ నిర్మించడానికి ముందుకువచ్చారన్నారు. ఏడు రంగులు కలిస్తేనే హరివిల్లు.. అలాగే మనుషులందరూ కలిస్తేనే ఒక అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించగలం అనే థీమ్ ఈ ఆల్బంలో దాగివుంది. జాత్యాంహకార దాడులు మాని శాంతిని పెంపొందించాలనే లక్ష్యమే ఈ ఆల్బానికి ఊపిరి పోసిందని చెప్పారు. ఈ పాట షూటింగ్ తెలంగాణ, గోవా ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ, లక్కవరం, నాగార్జున సాగర్, రామప్ప దేవాలయం వంటి అందమైన లొకేషన్లలో ఆరు రోజుల్లో చిత్రీకరించారు. ఆనంద్ కుమార్ గతంలో మూడు షార్ట్ ఫిలిమ్స్ తీశారు. వాటికి జాతీయ అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు లభించాయి. త్వరలో ఓ పెద్ద సినిమాతో మనముందుకు రానున్నారు. ఆల్బంలో కూడా చిన్న కథను చెప్పారు. ప్రియురాలికి చెప్పి విదేశానికి వెళ్లిన ప్రియుడు అక్కడ జాత్యాంహకార దాడిలో కన్నమూస్తాడు. చివరలో ప్రియురాలు తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. చూస్తుంటే ఎవరో గుండెను మెలిపెట్టినట్టు అవుతుంది. ఈ పాటలో అందమైన జంటగా సుమన్ రుద్ర, అనన్య పెనుగొండ నటించారు. మరొక విశేషం ఏంటంటే ఈ పాటలో నటించిన అనన్యే ఈ పాటను పాడారు కూడా.
దీనికి సంగీతం, సాహిత్యం పెద్దపల్లి రోహిత్ అందించారు. కొరియోగ్రఫీ కిరణ్ అంబుల సమకూర్చారు. సుందర్ శాస్త్రి నిర్మించారు. శరత్ కొప్పు తండ్రి కొప్పు రామ్మోహన్ సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa