ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న‌వ్వేజ‌నా సుఖినోభ‌వంతు!

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 07:59 PM

బ్ర‌హ్మానందం…. ఏ క్ష‌ణంలో ఈ పేరు పెట్టారో గానీ.. ఆనందం పంచ‌డ‌మే ఆశ‌యంగా న‌వ్విస్తున్నాడు బ్ర‌హ్మానందం! తెలుగు సినిమాకు ద‌క్కిన న‌వ్వుల వ‌రం – బ్ర‌హ్మానందం! టాలీవుడ్ కామెడీ కింగ్ – బ్ర‌హ్మానందం!హీరో ఎవ‌రైనా – అందులో బ్ర‌హ్మానందం ఉండాల్సిందే. ద‌ర్శ‌కుడు ఎవ‌రైనా – అందులో బ్ర‌హ్మానందం కామెడీ చేయాల్సిందే. సినిమా చిన్న‌దైనా, పెద్ద‌దైనా – దానికి పెద్ద‌దిక్కుగా నిల‌బ‌డి బ్ర‌హ్మానందం నిల‌బ‌డాల్సిందే!
తెలుగు సినిమా త‌న చుట్టూ తాను తిరుగుతూ బ్ర‌హ్మానందం చుట్టూ తిరుగుతోంది. అంత‌లా టాలీవుడ్‌ని ప్ర‌భావితం చేశారాయ‌న‌. చేతికి చెప్పులేసుకొని, కాలి వేళ్ల‌కు ఉంగ‌రాలు తొడుక్కొనే మొహ‌మూ నువ్వూనూ – ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం.. ఇదిగో ఇలాంటి డైలాగుల‌తోనే అర‌గుండు వేసుకొని తెగ న‌వ్వించాడు బ్ర‌హ్మానందం.
అప్ప‌టి నుంచీ.. ఆ న‌వ్వుల జోరూ. బ్ర‌హ్మీ హోరూ కొన‌సాగుతూనే ఉంది. అర‌గుండు, ఖాన్‌దాదా, మైఖెల్ జాక్స‌న్‌, మెక్‌డోల్డ్ మూర్తి, భ‌ట్టు, గ‌చ్చిబౌలి దివాక‌ర్,ప‌ద్మ‌శ్రీ‌, ప్ర‌ణ‌వ్‌, జ‌య‌సూర్య‌… బ్ర‌హ్మీ ఏ రూపంలో వ‌చ్చినా జ‌నం న‌వ్వారు, ప‌డీ ప‌డీ న‌వ్వారు. పొట్ట‌లు చెక్క‌లు చేసుకొన్నారు.
త‌న‌ న‌వ్వుల‌తో ద‌శాబ్దాల నుంచి వినోదాల వైద్యం చేస్తున్న డాక్ట‌ర్ ఆయ‌న‌. చ‌రిత్ర దేముందిరా, చింపేస్తే చిరిగి పోతుంది అంటాడు `అదుర్స్‌`లో బ్రహ్మానందం..కానీ బ్ర‌హ్మానందం చ‌రిత్ర‌.. చిరిగిపోయేది కాదు, చెరిగిపోయేది కాదు. అది సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌బ‌డుతుంది. అందుకే ఎన్నో అవార్డులు వ‌రించాయి. ప‌ద్మ‌శ్రీ కూడా వెతుక్కొంటూ వెళ్లిపోయింది.
ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం తీసుకొనే హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం. తొలి సినిమాకి ఆయ‌న పారితోషికం కేవ‌లం నూట ప‌ద‌హార్లు. అలాంటిది ఈరోజు ఆయ‌న పారితోషికం రోజుకి ల‌క్ష‌ల్లో ఉంది. అందుకు ఆయ‌న అర్హుడు కూడా. ఎందుకంటే బ్ర‌హ్మానందం పాత్ర క్లిక్ అయితే… సినిమా హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం టాలీవుడ్ జ‌నాల‌కు ఉంది. సెకండాఫ్‌లో బ్ర‌హ్మీ ఎంట్రీ ఇచ్చి.. సినిమాని నిల‌బెట్టేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌.. రేసుగుర్రం. కిల్‌బిల్ పాండేగా రెచ్చిపోయి వినోదాలు అందించాడు బ్రహ్మీ. ఈ సినిమాలో రెండో హీరో అనిపించుకొన్నాడు! ఇదొక్క‌టేనా… ఢీ, రెడీ, అదుర్స్‌, దూకుడు.. ఇలా అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో బ్ర‌హ్మీ క్యారెక్ట‌ర్ హైలెట్‌.. అదుర్స్ – సినిమా సూప‌ర్ హిట్‌. ”ఏవండీ నాగార్జున‌గారూ… ఇలాంటి వాళ్ల‌ను ఎలిమినేట్ చేయండి”– అంటూ పెన్ కెమెరా వంక చూస్తూ, అమాయ‌కంగా అంటుంటే న‌వ్వాపుకోనివాళ్లెవ‌రు..? చంప‌దెబ్బ‌కు రియాక్ష‌న్ బాగుందని కోరి మ‌రి కొట్టించుకొన్న బ్ర‌హ్మీ ఎక్స్‌ప్రెష‌న్ ఆల్ టైమ్ సూప‌ర్ హిట్‌!నీ ఎంక‌మ్మ అన్నా .. జ‌ఫ్ఫా అన్నా.. జ‌ఫ్ఫామే జ‌ఫ‌డా అన్నా జ‌నం న‌వ్వుతారు. ప‌దాల‌కు అర్థాలుండాలేంటి, బ్ర‌హ్మానందం ప‌లికితే చాలు. కేక పెట్టాల్సిందే.బ్ర‌హ్మానందం స్కోరు.. 1000 సినిమాలకు పైమాటే.
ఇంత సుదీర్ఘ‌మైన కెరీర్‌…. ఇన్ని సినిమాలూ… మ‌రో హాస్య‌న‌టుడు ద‌క్క‌లేదు. త‌రానికి త‌గ్గ‌ట్టు, ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు, ద‌ర్శ‌కుడికి త‌గ్గ‌ట్టు, ఎదురుగా ఉన్న న‌టుడికి త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మార్చుకొన్నాడు బ్ర‌హ్మీ. అందుకే ఆరేళ్ల ప‌సివాళ్ల‌నుంచి… అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్నీ అల‌రిస్తున్నాడు. తెలుగువాళ్లంద‌రూ మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుకొనేలా చేస్తున్నాడు. ఈ న‌వ్వులు ఇలానే కొన‌సాగాలి. ఆయ‌న న‌వ్వుతూ ఉండాలి. తెలుగు సినిమానీ, ప్రేక్షకుల్నీ న‌వ్విస్తూనే ఉండాలి. ఈమ‌ధ్య ఆయ‌న ఆరోగ్యం స‌రిగా లేదు. దిల్లీలో బైపాస్ స‌ర్జ‌రీ జ‌రిగిందాయ‌న‌కు. ప్ర‌స్తుతం కోలుకుంటున్నా ర‌ని, త్వ‌ర‌లోనే ఆయ‌న హైద‌రాబాద్ వ‌స్తున్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట ప‌డాల‌ని, ఆయ‌న ఎప్పుడూ ఇలానే న‌వ్విస్తుండాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుందాం..


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa