కన్నడ చిత్రపరిశ్రమలో ప్రముఖ నిర్మాత పార్వతమ్మ రాజ్ కుమార్ తనయుడు సూరజ్ ఆలియాస్ దృవన్ ప్రమాదానికి గురయ్యారు. ఊటీకి వెళ్తుండగా.. నంజన్ గూడు సమీపంలో అతను ప్రయాణిస్తున్న బైక్ను లారీ ఢీకొట్టింది. జూన్ 24 న శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.. సూరజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని సమీప ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ సూరజ్ కాలుపై పడడంతో నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో మోకాలి వరకు కాలు తొలగించారు వైద్యులు.
ప్రస్తుతం సూరజ్ మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సూరజ్ ను చూసేందుకు నటుడు శివరాజ్ కుమార్, నిర్మాత చిన్నెగౌడ మైసుర్ చేరుకుని సూరజ్ కుటుంబాన్ని పరామర్శించారు. కన్నడ సినీపరిశ్రమలోకి సూరజ్ ఆలియాస్ దృవన్ ఇప్పుడిప్పుడే హీరోగా అడుగుపెడుతున్నారు. స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని తన కల అని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పారు సూరజ్. ఇప్పటికే భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రంలో నటించిన సూరజ్.. ఇటీవలే మరో రెండు ప్రాజెక్టులను ప్రకటించారు.