సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా చేసిన సినిమా 'చిన్నా'. ఈ సినిమా తమిళంలో 'చిత్తా' గా ముందు విడుదలై అక్కడ మంచి ప్రశంసలు, పేరు సంపాదించింది. ఆ తరువాత తెలుగులో 'చిన్నా' గా విడుదల చేసాడు సిద్ధార్థ్, అప్పుడే సినిమా ప్రచారాలు సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు కూడా. సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారు అని ఇక్కడ అడిగారు అని భావోద్వేగం చెందాడు. ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పాడు, ఈ సినిమా బాగోలేదు అంటే తాను ఇక తెలుగుకి వచ్చి తన సినిమాలు విడుదల చెయ్యను అని కూడా ఆ భావోద్వేగంలో చెప్పాడు. అంటే అతను ఈ సినిమా మీద అంతగా నమ్మకం పెట్టుకున్నాడు అని అర్థం అవుతోంది. దీనికి ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకుడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. ఈశ్వర్ అలియాస్ చిన్నా (సిద్ధార్థ్) మున్సిపాలిటీ లో వుద్యోగం చేస్తూ ఉంటాడు. అతని అన్నయ అకాలంగా మరణిస్తే, అన్నయ్య కూతురు చిట్టి లేదా సుందరి (సహస్ర శ్రీ) ని, వదినని, చిన్నా చూసుకుంటూ ఉంటాడు. చిట్టి అంటే చిన్నాకి ప్రాణం, ఎప్పుడూ తనే స్కూల్ కి తీసుకెళ్లడం, తీసుకురావటం చేస్తూ ఉంటాడు. ఇలా సాఫీగా గడిచిపోతూ ఉంటే, ఒకరోజు చిట్టి స్నేహితురాలు మున్ని (సబియా తస్నిమ్) లైంగిక దాడికి గురవుతుంది. పదేళ్ల పిల్ల భయపడి ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. చిన్నా ఆరోజు మున్ని అదొకలా ఉండటం గమనించి చిట్టిని స్కూల్ దగ్గరే ఉండమని చెప్పి, మున్నిని ఇంటిదగ్గర దింపడానికి వెళతాడు. తరువాత మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానే అనే ఆరోపణలు వస్తాయి. చిన్నా స్నేహితులు కూడా అదే నమ్ముతారు. పొలిసు కంప్లైంట్ ఇవ్వడానికి మున్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, ఎందుకంటే పరువుపోతుందని. చిన్నానే చేసాడు అనడానికి ఒక వీడియో కూడా బయటకి వస్తుంది. చిన్నా వదిన కూడా చిన్నానే అనుమానిస్తుంది. అందరూ షాక్ కి గురవుతారు. ఈలోగా చిట్టి కూడా కనపడకుండా పోతుంది. ఇంతకీ ఈ లైంగిక దాడి చిన్నానే చేశాడా, ఎవరు చేశారు? చిట్టి ఏమైంది? చివరికి కథ ఎటు మలుపులు తిరిగింది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.