అవార్డ్ విన్నింగ్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన నరసింహ నంది నుంచి రాబోయే చిత్రానికి ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ అనే ఆసక్తికర టైటిల్ని ఫిక్స్ చేశారు. శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై తెరకెక్కనున్న ఈ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ సినిమాని బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమా గురించి నరసింహ నంది మాట్లాడుతూ.. షేక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా.. పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా కథను తయారు చేయడం జరిగింది. 1980 నాటి పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాను మలచడం జరిగిందని తెలిపారు.