నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాతో వరసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. ఈ సినిమా వరసగా మూడో విజయం అతనికి. ఇప్పుడు తన తదుపరి సినిమా దర్శకుడు బాబీ కొల్లి తో చేస్తున్న సగంతి తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలు పెడుతున్నట్టుగా తెలిసింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఒక పెద్ద పోరాట సన్నివేశంతో మొదలు పెడుతున్నట్టుగా తాజా సమాచారం. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 6వ తేదీ నుండి హైదరాబాదులో ఒక సెట్ వేసి, అందులో ఈ పోరాట సన్నివేశాన్ని కొన్ని రోజులు చిత్రీకరించనున్నట్టుగా సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాలి, కానీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాల వలన బాలకృష్ణ అవసరం అక్కడ వుండవలసి వస్తుందని, ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిసింది. దర్శకుడు బాబీ కొల్లి ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ తో చేస్తున్న సినిమాకి ప్రస్తుతం 'NBK109' అనే టైటిల్ పెట్టారు. ఈ పోరాట సన్నివేశానికి బిహెచ్ఈఎల్ దగ్గర ఒక సెట్ వేసినట్టుగా తెలిసింది.ఇక్కడ షూటింగ్ అయ్యాక, తరువాత ఊటీ వెళతారని తెలుస్తోంది. ఈ సినిమాని చాలా తొందరగా పూర్తి చెయ్యాలని అటు దర్శకుడు, ఇటు బాలకృష్ణ ఇద్దరూ వున్నారు. సితార ఎంటర్ టైనమెంట్స్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమాలో రాజకీయానికి సంబంధించి ఎటువంటి డైలాగులు కానీ, సన్నివేశాలు కానీ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.